Kamal Rajini: కమల్-రజనీకాంత్ మూవీ.. తాను దర్శకుడిని కాదన్న స్టార్ డైరెక్టర్
Kamal Rajini: కోలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ గురించి అభిమానులకు ఒక కీలక అప్డేట్ అందింది. దాదాపు 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అగ్ర కథానాయకులు, సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కలిసి ఒక సినిమా చేయబోతున్న విషయం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి.
ముఖ్యంగా, ఈ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరు అనే విషయంపై తీవ్ర చర్చ జరిగింది. ‘లవ్ టుడే’ వంటి విజయవంతమైన చిత్రంతో పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించే అవకాశం ఉందని కొన్ని రోజులుగా వార్తలు బలంగా వినిపించాయి. అయితే, తాజాగా ప్రదీప్ రంగనాథన్ స్వయంగా ఈ ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు.
రజనీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ప్రదీప్ రంగనాథన్ సమాధానమిస్తూ, “ఆ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నాకు వచ్చిందా లేదా అనే దాని గురించి కూడా నేను చెప్పను. కానీ, ప్రస్తుతం నేను ఆ ప్రాజెక్ట్‌లో భాగం కాను. ఎందుకంటే, నా దృష్టి అంతా ఇప్పుడు దర్శకత్వం కంటే నటన పైనే ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు దూరంగా ఉన్నాను” అని తెలిపారు. ఈ మల్టీస్టారర్ గురించి ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేనని కూడా ఆయన పేర్కొన్నారు.
రజనీకాంత్‌కు తాను వీరాభిమానిని అని ప్రదీప్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇప్పటివరకు విడుదలైన ఆయన సినిమాలు అన్నింటినీ మొదటి రోజు మొదటి ఆట చూశానని, ఆయన ఇటీవల తన సినిమా ‘డ్రాగన్’ విడుదలయ్యాక తనను ప్రశంసించారని, ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రదీప్ తెలిపారు.
ఈ మల్టీస్టారర్ గురించి కమల్ హాసన్ ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకలో అధికారికంగా వెల్లడించారు. వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, “ప్రేక్షకులు మా కాంబినేషన్‌ను ఇష్టపడితే అంతకంటే మంచి ఇంకేముంటుంది? మేమిద్దరం కలిసి నటించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నించినా అది కుదరలేదు. అయితే, త్వరలోనే మీ ముందుకు కలిసిరానున్నాం. అది మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది” అని స్పష్టం చేశారు. దీంతో ఈ చారిత్రక ప్రాజెక్ట్ గురించి కోలీవుడ్‌లో ఉత్సాహం మరింత పెరిగింది. దర్శకుడి పేరుపై, సినిమా గురించి మరిన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
