Hindu Marriage System : హిందూ సంప్రదాయంలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్రాల ప్రకారం పెళ్లికి చాలా కట్టుబాట్లు, ఆనవాయితీలు, ఆచార వ్యవహారాలు అన్ని ముడిపడి ఉంటాయి. హిందువులలో పెళ్లి చేయాలి అని అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. అలాగే పద్ధతులు, పట్టింపులు కూడా హిందూ మతంలో వివాహం విషయంలో ఎక్కువగానే ఉంటాయి.
హిందూ సంప్రదాయ ప్రకారం ఓకే ఇంటి పేరు కలిగిన వారిని పెళ్లి చేసుకోరు. అలాగే ఒకే గోత్రం కలిగిన వారిని కూడా పెళ్లి చేసుకోరు. సంబంధం మాట్లాడేముందే వారి గోత్రాలు, ఇంటి పేర్లు తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తారు. పురాణాలలో ఒకే గోత్రం కలిగిన వారిని పెళ్లి చేసుకోవడం నిషేధం అని రాసి ఉంది. ఒకే గోత్రం కలిగిన వారిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు,
ఒకవేళ చేసుకుంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు తెలుసుకుందాం. హిందూమతంలో ఒకే గోత్ర వివాహం నిషేధం. దీని వెనుక గల కారణం గోత్రం ఋషులతో ముడిపడి ఉంటుంది. అంటే దాని అర్థం ఒక గోత్రానికి చెందిన ఋషి పురుషుడు లేక స్త్రీకి పూర్వికులుగా పరిగణింపబడతాడు. అంటే వారి వారసత్వంగా మనం కొనసాగుతున్నామని అర్థం.
అలాంటప్పుడు ఒకే గోత్రానికి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం వల్ల వారు మనకు అన్న,తమ్ముల వరస లేకపోతే అక్కా,చెల్లెళ్ల వరుస అవుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒకే గోత్రానికి చెందిన వారితో వివాహాన్ని నిశ్చయించుకోరు. దీని కారణంగానే హిందూమతంలో శాస్త్రాల ప్రకారం ఒకే గోత్రం కలిగిన వివాహం నిషేధం అని రాసి ఉంది.