Ram Charan : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కష్టం అన్న మాట వినిపిస్తే చాలు చిరు మనసు విలవిలలాడుతోంది. ఇక తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రామ్ చరణ్ సైతం ఆయన సేవా గుణాన్ని కూడా కొనసాగిస్తున్నాడు. చరణ్ సైతం చిరులానే కష్టం అన్నవారికి సాయంగా ఉంటున్నాడు. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీఓల ద్వారా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కోవిడ్ ఆపత్కాలంలో పలు రకాల సహాయాలు అందిస్తూనే ఉన్నాడు.
దీంతో తమ అభిమాన హీరో చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకున్న ఫ్యాన్స్ సమాజానికి సాయపడాలని ముందుకొచ్చారు. దేశంలోని చాలా నగరాల్లో గత కొన్ని రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబయికు చెందిన సుమారు 1000 మంది చరణ్ అభిమానులు సామాన్యులకు తమవంతు సాయం చేయాలని భావించారు. సోమవారం మధ్యాహ్నం జుహూ, భివాండి ప్రాంతాల్లోని శంకర్ ఆలయం పరిసరాల్లో మజ్జిగ పంపిణీ చేశారు.
దాదాపు 10 వేల మందికి మజ్జిగ బాటిల్స్ అందించారు. మరికొన్ని చోట్ల అన్నదానం చేశారు. తమ స్టార్లాగానే సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని.. తమకు వచ్చిన ఆలోచనకు ఒక రూపం మాత్రమేనని అన్నారు చెర్రీ ఫాన్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్ వైరల్ గా మారాయి. ఇక ఈ సేవా కార్యక్రమాలను చూసి నెటిజన్లు మెగా ఫ్యాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే..