అన్నం తిని టీవీ దగ్గర కూర్చుంటే ఏదో చిత్రమైన ప్రోగ్రాం వస్తోంది.
మునసబు గారి బండెలదొడ్లో పశువుల్ని బందించినట్లు ఒక ఇంట్లో మనుషుల్ని బంధించారు.
మా గోదారోళ్ళకి సెట్టయ్యే ప్రోగ్రామ్లా లేదు.
ఇక్కడ గోడవైతే అందరూ సర్దుకుంటారు.
అక్కడ కావాలనే, ఆ కొంపలో.. పనికిరాని గొడవలు పెట్టుకుంటారు. అట్టు కోసం అరగంట కొట్టుకునే అల్పమైన మనుషులు ఉన్నారక్కడ.
అందమైన బట్టలు వేసుకుని మరింత అందంగా ఈ ఇంగ్లీషులో మాట్లాడతారు.
గ్రూపులు కట్టి గొడవలు పెట్టుకుంటారు.
పెద్ద ఇల్లుంది వాళ్ళకి..
కానీ మనసులో చాలా ఇరుకు..
చూస్తా ఉంటే.. వీళ్ళకంటే అడగకుండానే ప్లేట్లో అరిటాకు వేసి ఆప్యాయంగా కొబ్బరి డొక్కల పొయ్యి మీద నుంచి వేడి వేడి మినపరొట్టె వేసిచ్చి ఆప్యాయంగా పలకరించే ఇసుకపూడి మా ఏడిద సత్యనారాయణ గారే బెటర్.
హిప్పీ జుట్టు కటింగ్ తో ఒకడు..
చెవులకి ప్లాస్టిక్ రంగులు పెట్టుకుని ఒకమ్మాయి…
అసలు వీళ్ళు తెలుగోళ్లేనా అని డౌటానుమానం నాకొచ్చింది.అసలు వీళ్ళు సెలబ్రిటీలు ఎలా అయ్యారు అనే సందేహం కూడా నన్ను వేధిస్తోంది.
కోట్లాదిమంది చూస్తున్నారట..
ఎవడి కొంపలో అయినా గొడవలు వస్తే పక్కింటోడికి
ఉన్న ఆశక్తి ఆధునిక యుగంలో కూడా పోలేదు.
ఒకరినొకరు తిట్టుకోవాలి..
అసహ్యంగా చూసుకోవాలి…
ద్వేషంతో రగిలిపోవాలి..
అప్పుడే ఛానల్ కి కాసుల పంట పండుతుంది.
ఇంత పెద్ద చదువులు చదివి ఎంగిలి ప్లేట్ల ఎవరు కడగాలి అనేది అక్కడ పెద్ద సమస్య..
దాని కోసం గంట సేపు యుద్ధం..
ఆ షోల కొంతమంది వెళ్లిపోతుంటే ప్రేక్షకులు కూడా గొల్లున ఏడవటం కొసమెరుపు.
నిన్నటిదాకా తిట్టి ఈ రోజు వెళ్లిపోతుంటే దొంగ ఏడుపులు..
ఎలిమినేషన్ కి ఓటేసి వెళ్లే ముందు కౌగలించుకొని ప్రేమగా వీడ్కోలు చెప్పడం అక్కడ మర్యాద.
పిచ్చి పిచ్చి టాస్క్ లు ఇచ్చి చోద్యం చూడటం
బిగ్ బాస్ ఉద్యోగం..
ఇదో కొత్త లోకం..
ఇదో చెత్త లోకం..
