మనూరికి సీబీఐ వాళ్ళు వత్తాన్నారంట సోంపల్లి రేవులో కుర్చీని వేప్పుల్లతో పళ్ళు తోముకుంటున్న కాజా రాము అప్పుడే రేవు దాటి పాలు తీసుకుని ఇంటికి వస్తున్న గుమ్మడి సత్తిబాబు తో అన్నాడు. పాల కేరెజి పక్కనెట్టి.. ఎందుకంటావ్ అని అక్కడే ఉన్న రావి చెట్టు కింద కూర్చుని ఆరాగా అడిగాడు సత్తిబాబు.
మొన్న అంతరేజి గుడి బయట ఉన్న రథానికి ఎవరో నిప్పెట్టేశారు కదా.. ఆ గొడవ పెద్దదయ్యి ఢిల్లీ వరకూ వెళ్ళిందట. ఎక్కడెక్కడి నుంచో నాయకులు గొడవ తేల్చాల్సిందే అని ధర్నాలు చేస్తున్నారు. అందుకని సీబీఐ వాళ్ళ కి ప్రభుత్వం కేసు మొత్తం అప్పజెప్పి ఆళ్ళని పట్టుకోమని చెప్పిందట అని రాము చెప్పుకుంటూ పోతున్నాడు. గడ్డి మోపుతో వచ్చిన కాళ్ళ బోగిరాజు మోపు పక్కన పడేసి, ఆ సీబీఐ వాళ్ళు తీసుకున్న కేసులు బండారు లంకలో నేతకు ముందు ఆరేసే దారల్లా సాగుతూనే ఉంటాయి గానీ ఎంతకూ తెమలవంటన్నారు కొంతమంది అని బాంబ్ పేల్చాడు.
బోగిరాజు మాటల్లో చెప్పాలంటే వాళ్ళు ఉండటానికి స్టార్ హోటళ్లు ఉండాలట. వాళ్ళు ఖాకీ బట్టలు వేసుకోరు. పది కార్లు వస్తాయి. ముప్పై మంది గుమస్తాలు వస్తారు.వాళ్ళు సఖినేటిపల్లి సెంటర్లో మూడు తూములు దగ్గర దొరికే కొబ్బరి చట్నీ మినపరొట్టె తినరు. అన్నీ ప్రత్యేకంగా భీమవరం నుంచి రావాలి భోజనాలు. మళ్లీ లోకల్ పోలీసుల సహాయం కావాలి వాళ్ళకి.మొత్తానికి కొండని తవ్వి ఎలుక ని పడితే అదృష్టమే అన్నాడు.
అదేంటి మరి వాళ్ళ కి ఇస్తే అంతా అయిపోయినట్టే దొంగలు దొరికేస్తారని పేపర్లో రాసారని కాజా రాము ఆశ్చర్యం గా అడిగాడు వాళ్లు దర్యాప్తు చేసిన కేసులో సగం మంది దొంగలు విదేశాలకి పారిపోయారు సగం మందికి చచ్చిపోయారని వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే అర్థమవుతుందని కాళ్ళ బోగిరాజు మళ్ళీ చెప్పాడు. అయితే రథానికి నిప్పు పెట్టిన దుర్మార్గులు దొరకరు అంటావా ఆవేదనగా అడిగాడు సత్తిబాబు.
వాళ్ళు దొరకొచ్చు దొరక్కపోవచ్చు. కానీ సీబీఐ వారు లక్ష పేజీల నివేదిక ఇస్తారు. కొన్నాళ్ళకి కొంతమంది అరెస్ట్ అవుతారు. సాక్ష్యం ఉంటే శిక్ష పడుతుంది. లేకపోతే అంతరేజి తీర్థం లో ఆ నివేదిక పుస్తకాలు వేసి అమ్ముకోవడం తప్ప చేసేదేంలేదు ముగించాడు.
దూరంగా పాడైపోయిన నావ మీద వున్న పాలపిట్ట ఈ వార్తలు అన్నీ నరసన్న స్వామి చెవిలో వేసింది. ఆయన నవ్వుతూనే వున్నాడు. ఆ నవ్వు అన్నా చెల్లల్లా గట్టులో నీరంత స్వచ్ఛంగా ఉంది.