సాయంత్రం ఐదు దాటితే రెడ్డి గారు దొరకరండీ.. ఫోన్లో ఎవరికో చెబుతున్నాడు గుమస్తా వీరబాబు.
పోనీ కుతుకులూరు మిల్లు దగ్గర దొరుకుతారా? అవతల నుంచి ఫోన్లో ఆరా తీస్తున్నారు కొత్త రైస్ మిల్లుకు మిషనరీ సరఫరా చేసే కంపెనీ వాళ్ళు.
మీరు ఏమైనా అనుకోండి.. ఆయన ఆ టైం దాటితే మీకు దొరకరు. మీరు ఇషాపట్నంలో ఉండిపోయి పొద్దున్నే రండి. అవతల నాకు పనుంది అని విసుగ్గా పెట్టేసాడు వీరబాబు.
ఆరు గంటలకి వచ్చిన బెంగుళూరు బియ్యం డీలర్ కి కర్నూలు నుంచి వచ్చిన తవుడు పార్టీకి.. ఆయన బెంగాల్ బీహార్ ఎగుమతి చేసే గుడ్ల పార్టీకి.. కూతురు పెళ్లికి పిలవడానికి వచ్చిన అరటి గెలలు పాట్నా కి ఎగుమతి చేసే సాయిబు గారికి అదే చెప్పాడు ఈరబాబు. ఎంత మంది వచ్చినా అదే సమాధానం. ఎంత గొప్పవాళ్ళు వచ్చినా అదే సమాధానం.
ఈరబాబు దెబ్బకి రెడ్డి గారి కంటే వీడి ఫోజు ఎక్కువైందని తిట్టుకుంటూ అందరూ వెళ్లిపోయారు. కొంతమంది రెడ్డి గారి సెల్ ఫోన్ కి ఫోన్ చేస్తే ఈరబాబే ఎత్తాడు. అవాక్కాయన వాళ్ళకి రెడ్డిగారు మిల్లు దగ్గర తప్ప ఇంటిదగ్గర సెల్ వాడడు అని చెప్పేసరికి ఏం చెప్పాలో తెలీక సైలెంట్ అయిపోయారు.
ఇంత మంది వచ్చినా రెడ్డిగారికి లెక్క లేదా సార్? పొద్దున్న దాకా ఉండాలి అంటే రాజమండ్రి వెళ్లి లాడ్జీలో ఉండాలి. ఆయనకి ఇంత పొగరేంటి? మద్రాసు నుంచి వచ్చిన కుర్ర ఇంజనీరు ఈ తతంగం అంతా చూసి రైస్ మిల్ గేట్ దగ్గరకు వచ్చి కంపెనీకి ఫోన్ లో కంప్లైంట్ చేసాడు.
నువ్వు అన్నీ మూసుకుని ఆయన వచ్చినప్పుడే కలువు. రెడ్డి గారిని ఏమన్నా అంటే మాటా మర్యాదగా దక్కదు అంటూ అవతలి నుంచి సమాధానం వచ్చింది.
నైట్ అంతా వెయిట్ చేయడం ఇష్టం లేని కుర్ర ఇంజినీరు ఎలాగైనా రెడ్డిగారిని పట్టుకోవాలి అని.. గేటు దగ్గర టోపీ పెట్టుకు కూర్చొన్న వాచ్ మెన్ గూటం వెంకట్రావుని ఆరా తీసాడు.
తీరిగ్గా చుట్ట అంటించుకుని గేటుకు జేరబడి అతను చెప్పిన సమాధానం విన్న మద్రాసు ఇంజినీరుకు మతిపోయింది. మా రెడ్డి గారు ఐదు గంటలకు పొలం వెళ్తారు. అప్పుడు ఎవర్ని కలవరు అంటే పిచ్చెక్కిపోయింది. మేము ఇంత ఇంపార్టెంట్ పని మీద వస్తే పొలం వెళ్లి ఏం చేస్తాడట మీ రెడ్డి గారు అని మళ్ళీ ప్రశ్నించాడు. అవన్నీ నీకు అనవసరం అని కుండ బద్దలు గొట్టినట్లు సమాధానం చెప్పిన వాచ్ మాన్ దగ్గర ఏదో లాగా అడ్రస్ తెలుసుకుని తనతోటి బ్యాచ్ ని వెక్కించుకుని రెడ్డి గారి పొలం వైపు పోనిమ్మన్నాడు కుర్ర ఇంజనీరు.
కార్లో కూర్చున్నా ఇంజనీరు బుర్రకు ఎంతకీ అర్ధం కావడం లేదు. అసలు ఐదు గంటలకే వెళ్లి ఈ రెడ్డిగారు ఏం చేస్తూంటారు అని ఒకటే ఆశక్తి. కార్ తాపేశ్వరం దాటి చిన ద్వారంపూడి వంతెన దాటి అనపర్తి రోడ్ లో ఒక కొబ్బరి తోట గేట్ ముందు ఆగింది. హారన్ కొడితే.. ఎవరో కొద్ది పుష్టిగా ఉన్న యాభై ఏళ్ళ పెద్దాయన బనీలు లుంగీ కట్టుకుని గేట్ తీసి మళ్లీ లోపలికి వెళ్ళి వరసగా చెట్లకి కట్టేసి ఉన్న ఆవులకి దాణా పెడుతున్నాడు. అదయ్యాక బయట కడిగేసి శుభ్రంగా ఉన్న పాల కేన్ తెచ్చి రెండు ఆవుల పాలు తీసి కార్ లో పెట్టుకున్నాడు.
విసుగొచ్చిన ఇంజినీర్ గంట నుంచి చూస్తున్నాను. నీ పని నీదే గానీ మీ రెడ్డి గారు ఎక్కడా అసహనంగా అతన్ని చూస్తూ అడిగాడు. నీకసలు మర్యాద ఉందా? ఇంతమంది వెయిట్ చేస్తుంటే సమాధానం చెప్పవేంటి? చిరాగ్గా అన్నాడు
ఆయన చిరునవ్వుతో వాళ్ళని చూస్తూ మీరు అడుగుతున్న వ్యక్తిని నేనే.. నేను పొలంలో బిజినెస్ విషయాలు మాట్లాడను. నాకు యాపారం కంటే సంతృప్తే ముఖ్యం. మిమ్మల్ని చూసి ఆవులు కంగారుతో బెదురుతున్నాయి. ఏం అనుకోకండి.. పొద్దున్నే రండి..
అని నవ్వుతూ వెళ్లి ఆవుల తలపై చెయ్యేసి నవ్వుతూ నిమురుతున్నాడు..
ఆ నవ్వు ఆవు పాలంత స్వచ్ఛంగా ఉంది.
నిండు గోదాట్లో స్నానం చేసినంత హాయిగా ఉంది.