Eye Infections : కండ్ల కలక ఇప్పుడు ఇది రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న విషయం. ఇప్పుడు ఎక్కువ శాతం ఈ వ్యాధి వ్యాపించి అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. మన పూర్వీకుల నుంచి ఈ వ్యాధి ఉన్నప్పటికీ ,ఈసారి మాత్రం కాస్త ఎక్కువగానే ఇది వ్యాపించి అందరిని ఆలోచించేలా చేస్తుంది. కండ్లకలక వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి.. దాని నుండి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి.. తెలుసుకుందాం.
కండ్ల కలక ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఐదుగురిలో ఒకరికి ఈ సమస్య ఉంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంటే ఇది ఎంతలా ప్రబలుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.. సాధారణంగా వర్షాకాలంలో వచ్చే ఈ ఇన్ఫెక్షన్ గురించి మనకు తెలిసే ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు, అంటువ్యాధులు ప్రబలుతూనే ఉంటాయి.
అందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు, దగ్గు, జ్వరం, జలుబు లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటితోపాటు ముఖ్యంగా వచ్చేది కండ్ల కలక. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని భయాందోళనకు గురిచేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరికీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అయితే తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ వ్యాధి 5 నుండి 8 మందికి త్వర, త్వరగా వ్యాపిస్తుందని ప్రతి ఐదుగురిలో ఒకరికి ఖచ్చితంగా ఉంటుందని వారు వెల్లడించారు. కండ్ల కలక వచ్చినప్పుడు తీవ్రమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కళ్ళు ఎర్రబడడం, కళ్ళు లోపల గుచ్చుకున్నట్టుగా
అనిపించడం, ఎప్పుడూ కళ్ళు పూసి తోడడం, అలాగే వెలుతురు చూడాలంటే ఇబ్బందికరంగా ఉండడం అనిపిస్తుంది. కండ్ల కలక సోకితే మూడు నుండి ఐదు రోజులు ఖచ్చితంగా దాని ప్రభావం మన పైన ఉంటుంది. కరోనా వైరస్ కంటే వేగంగా ఈ కండ్ల కలక వ్యాప్తి చెందుతుందంటే దీని ప్రభావం ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. ముఖ్యంగా హైఫ్లూ, ఐ ఇన్ఫెక్షన్ గా దీన్ని పిలుస్తూ ఉంటారు. కళ్ళకలక వచ్చినప్పుడు సొంత వైద్యాలు అసలు చేయకూడదు. కండ్లు మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాబట్టి ఇన్ఫెక్షన్ సోకిన వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
ఒకరి నుంచి ఒకరికి అంటుకునే ఇన్ఫెక్షన్ కాబట్టి పక్క వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాగే టవల్స్, దుప్పట్లు, ఇతర వస్తువులను ప్రత్యేకంగా వాడాలి. ఈ వ్యాధి సోకినప్పుడు మాత్రం బయటి ప్రదేశాలకు వెళ్లకూడదు. కండ్ల కలక వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. కళ్ళకు అద్దాలు పెట్టుకొని మాత్రమే ఉండాలి. ఇతరులను అస్సలు తాకకూడదు. ఆలస్యం చేయకుండా వైద్యుని వెంటనే సంప్రదించాలి.