Mrigashira Karte : ఈరోజు (బుధవారం) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కాబోతుంది. రోహిణి కార్తెలో ఎండలు ఎంతలా విజృంభించాలో అంత వేడిని, వడగాలును మనకు రుచి చూపించాయి. మృగశిర కార్తెలో నుండి వాతావరణం చల్లబడు తుంది. మనం కాస్త ఊపిరి పీల్చుకోవచ్చును. అయితే ఈ మృగశిర కార్తెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
సూర్య భగవానుడు ఒక్కొక్క కార్తెలో 14 రోజులపాటు ఉండి ఏ నక్షత్రానికైతే దగ్గరగా ఉంటాడో ఆ కాలానికి (కార్తె) అ నక్షత్రం పేరు పెడతారు. అశ్విని నక్షత్రంతో ప్రారంభమైన ఈ కార్తెలు, రేవతి నక్షత్రంతో ముగుస్తాయి. మొత్తం 27 నక్షత్రాల పేర్లతో 27 కార్తెలు ఉంటాయి. సౌరమాన లెక్కల ప్రకారం, ఈ కార్తెలు ఆంగ్ల గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదీలలో వస్తూ ఉంటాయి.
రోహిణి కార్తెలో మండుటెండల్లో ఉన్నటువంటి ప్రజలు, మృగశిర కార్తె కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే వర్షానికి తొలిమెట్టు ఈ మృగశిర కార్తెనే. రోహిణి కార్తెలో రొళ్లు పగిలే ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజానీకం, ఈ మృగశిర కార్తె నైతిరుపతి పవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది.
ఈ కార్తెతో రైతన్నలు వ్యవసాయాన్ని మొదలు పెట్టుకునే రోజులు ప్రారంభమవుతాయి. దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటారు. తొలకరి జల్లులు పడడంతోనే విత్తనాలు చల్లడం మొదలుపెడతారు. ఈ కార్తెకు ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క విశిష్టత ఉంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీన్ని జరుపుకుంటారు. కొందరు బెల్లంలో, ఇంగువను కలిపి తింటూ ఉంటారు.
ఎందుకంటే ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షాకాలంలో వచ్చే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని భావిస్తారు.ఇంకొంతమంది ఈ మృగశిర కార్తె రోజు ఖచ్చితంగా చేపలను వండుకొని తింటారు. అలా తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నియంత్రించవచ్చు అని వారి నమ్మకం.
ఉబ్బసం వ్యాధి ఉన్నవారికి ఈ కార్తె రోజు చేప మందు పంపిణీ : ఉబ్బసం (ఆస్తమా) రోగులకు ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని సోదరులు చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మృగశిర కార్తె దేవగణానికి చెందినది. దీనికి అధిపతుడు కుజుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి అదృష్టం కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు.
ఈరోజు చేపలకు భలే గిరాకి : మృగశిర కార్తె రోజు చేపలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ప్రజల విశ్వసిస్తూ ఉంటారు. దాని కారణంగా ఈరోజు మార్కెట్లలో చేపలకు చాలా గిరాకీ ఉంటుంది. చేపలను అధిక ధర పెట్టి విక్రయిస్తూ ఉంటారు.