Rohini Karte : రోహిణి కార్తెలో ఎండలకు రోళ్ళు పగులుతాయని నానుడి.. ఆ కార్తెలో భానుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలం నాలుగు నెలలు ఒక ఎత్తు అయితే, ఈ రోహిణి కార్తె మాత్రం ఇంకో ఎత్తు. దీనినీ తట్టుకొని ఎండలను జయించాలి అంటే మామూలు విషయం కాదు. ఎండ తీవ్రత అధికం అయిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.
రోహిణి కార్తె.. మే 25 అనగా ఈరోజు ప్రారంభమై జూన్ 8 వరకు ఉంటుంది. ఈ రోహిణి కార్తె పక్షం రోజులు అత్యధిక వేడి, ఎండల తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత అధికంగా ఉంటుంది. ఎండ తీవ్రతకు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. రోహిణి కార్తె ఎండ తీవ్రతలో ప్రజలు తగు శ్రద్ధ తీసుకోకపోతే అనారోగ్య బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల మనలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఆ వేడి వల్ల మనకు వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఎక్కువనే. కాబట్టి ఎక్కువగా నీళ్లు త్రాగడం, వాటితోపాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ,రాగిజావ లాంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం కాపాడుకోవచ్చు.అయితే తీసుకోకూడని పదార్థాలు.. పచ్చళ్ళు, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారం, వేపుళ్లు, మసాలా లాంటి పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది.
అన్ని రకాల వయసు వారు కాటన్ దుస్తులను, అందులోను తెలుపు రంగు దుస్తులను ,ధరించడం మంచిది. తేలిక రంగు గల కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఉష్ణోగ్రత తీవ్రత నుండి కాపాడుతుంది. చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వేడి అధికంగా ఉన్నట్లయితే వారి శరీరాన్ని తడిబట్టతో తుడుస్తూ ఉండాలి. దానివల్ల అధిక వేడి నుంచి వారు ఉపసమనం పొందుతారు.