Samosa : సమోసా ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి కదా.. సాయంత్రం వేళల్లో అల్పాహారంగా, చిన్న,చిన్న ఆకలిని తీర్చే పదార్థంగా ఈ సమోసా బాగా పాపులర్ అయిపోయింది. అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. సమోసాను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ సమోసా ఎక్కడినుండి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా.. అసలు ఈ సమోసా యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సమోసా ఇరాన్ నుండి వచ్చిందని చెప్తుంటారు. ఇరాన్ నుండి వచ్చిన సమోసా ఇప్పుడు ప్రపంచం మొత్తం తన సత్తా చాటుతుంది. ఎక్కడ చూసినా కూడా మనకు సమోసా షాపులు కనిపిస్తుంటాయి. సమోసా అనే పదం పర్షియన్ భాష ‘సంబోసాగ్’ నుండి ఉద్భవించింది. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు వారితో పాటుగా సమోసా కూడా భారతదేశానికి వచ్చిందని చరిత్రకారుల అధ్యయనాల్లో వెల్లడైంది.
ఇక అప్పటినుంచి సమోసా భారతదేశంలో సత్తా చాటుతూనే ఉంది. తన రుచి ద్వారా ఎంతో మందికి ఇష్టమైన ఆహార పదార్ధంగా మారిపోయింది. అయితే సమోసా వెనక ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది అది ఏమిటంటే…10వ శతాబ్దంలో మహ్మద్ ఘజ్నవి ఆస్థానంలో మాంసంతో కలిపి తయారు చేసిన ఒక రాజ పేస్ట్రీ వడ్డించబడేదని ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇది సమోసాల మాదిరిగానే ఉంటుందని చరిత్ర కారులు చెబుతున్నారు. ఏది ఏమైతేనేమి ఇప్పుడు సమోసా అందరికీ ఇష్టమైన వంటకంగా మారిపోయింది.