Smart Phone : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అందరి చేతుల్లో కనిపిస్తుంది. ఫోన్ వాడకంలో చిన్నలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఫోన్ వాడేస్తున్నారు. కానీ ఒక పట్టణంలో మాత్రం చిన్నపిల్లలు ఫోన్ వాడడం నిషేధించారు. ఐర్లాండ్ లోని గ్రేస్టోన్ పట్టణంలోనీ ప్రాథమిక పాఠశాల పిల్లలకు స్మార్ట్ ఫోన్ లు నిషేధించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలో, ఇళ్లల్లో ప్రతి చోట ఫోన్ లను నిషేధించాలని పేరెంట్స్ అసోసియేషన్ కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల ఆ ప్రభావం పిల్లల మానసిక ఆరోగ్యం పై పడుతుందని, పిల్లలను దీని నుండి రక్షించుకోవాలంటే, స్మార్ట్ ఫోన్ నిషేధించాలని ఆ పట్టణ పౌరులందరూ అభిప్రాయపడుతున్నారు. పిల్లలను ఆ స్మార్ట్ ఫోన్ మాయాజాలం నుండి ఎంత కాపాడుకుంటే అంత మంచిదని వారి ఉదేశ్యం. తెలియకుండానే స్మార్ట్ ఫోన్లో ఉండే అడల్ట్ కంటెంట్ వైపు పిల్లల దృష్టి వెళుతుందని గ్రహించిన ప్రజలు, పేరెంట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అధికంగా మొబైల్ వాడే పిల్లల జీవనశైలి రోజురోజుకీ మారిపోతుందని, దాని కారణంగా వారికి ఆకలి లేకపోవడం, చిరాకు, ఊబకాయం లాంటివి వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ ముందు పిల్లలు ఎక్కువ సమయం గడపడం వల్ల వారికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. శారీరక శ్రమ, క్రీడలు, వ్యక్తులతో మాట్లాడటం లాంటివి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో వెనుకబడి పోతున్నారు.
చిన్న వయసులోనే పిల్లలకు ఫోన్ ఇవ్వడం వల్ల వారి మానసిక వికాసం దెబ్బ తింటుందని పరిశోధనలో వెల్లడయింది. భారతదేశంలోని 24 శాతం మంది పిల్లలు నిద్రపోయే ముందర స్మార్ట్ ఫోన్లో తనిఖీ చేస్తున్నారని భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో నివేదించింది. పిల్లలు స్మార్ట్ ఫోన్ వినియోగించే విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారికి వీలైనంత దూరంగా స్మార్ట్ ఫోన్ లని ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.