World No Tobacco Day : పొగాకు, ధూమపానం వల్ల చాలామంది అనారోగ్యం బారినపడి చనిపోవడం, క్యాన్సర్ బారిన పడడం మనం చూస్తూనే ఉంటాం. పొగాకుకు వ్యతిరేకంగా ఒక రోజంటూ ఉంది. మే 31 ఈరోజున ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలు 1987లో ప్రపంచ హెల్త్ అసెంబ్లీ డబ్లూహెచ్ఎ 40.38 తీర్మానాన్ని ఆమోదించారు.
పొగలోని నికోటిన్ మనల్ని వాటికి బానిసలుగా చేసుకుంటుంది. పొగాకు అంటే ఒక్క సిగరెట్ మాత్రమే కాదు.. చుట్టలు ,బీడీలతో పాటు.., ఖేని, జల్ద వంటివి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువే. రోజుకు 20 సిగరెట్లు తాగే వారితో పోలిస్తే ఒకటి, రెండు తాగిన వారికి గుండెపోటు వచ్చే అవకాశం 40 నుండి 50 శాతం వరకు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పొగ తాగినప్పుడు శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోను రిలీజ్ అవ్వడం వల్ల ఒకసారిగా రక్తం గడ్డ కట్టడం లాంటివి సంభవిస్తాయి. పొగ తాగే వారి జీవితకాలం పదేళ్లు తగ్గుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి ధూమపానం వల్ల రక్తనాళాలు సంకోచించి రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. తక్కువ నికోటిన్ ఉన్న సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమే.
అయితే పొగాకు సిగరెట్ తాగడం మానేసిన ఐదేళ్ల తర్వాత గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయి. వీటి ప్రభావం నేరుగా ఊపిరితిత్తుల పైన ఉంటుంది. దానివల్ల దీర్ఘకాల లంగ్స్ సమస్య రావచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.