Allu Arjun: భారతీయ సినీ చరిత్రలో సంచలనం.. ప్రభాస్ రికార్డు బ్రేక్ చేసిన అల్లు అర్జున్.. ఒక్క సినిమాకు రూ.175 కోట్లు
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు ‘నేషనల్’ నుంచి ‘ఇంటర్నేషనల్’ స్థాయికి చేరింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆయన తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప 2’, ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రారంభ రోజు నుంచే రికార్డుల వర్షం కురిపించిన ఈ చిత్రం, మొదటి రోజు రూ.290 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ అనూహ్య విజయంతో అల్లు అర్జున్ క్రేజ్, మార్కెట్ విలువ ఊహించని స్థాయికి చేరుకున్నాయి.
‘పుష్ప 2’ గ్లోబల్ సక్సెస్ తర్వాత, ఐకాన్ స్టార్‌కు సినీ మేకర్స్ నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. ఆయనతో సినిమా చేసేందుకు అగ్ర నిర్మాతలు, దర్శకులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికే నటుడిగా టాప్ గేర్‌లో ఉన్న బన్నీ, తాజాగా అత్యధిక రికార్డు రెమ్యునరేషన్‌తో వార్తల్లో నిలిచారు.
బాలీవుడ్ మీడియాలో వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేయబోతున్న భారీ బడ్జెట్ సినిమా కోసం ఏకంగా రూ.175 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం భారతీయ సినీ చరిత్రలో ఒక హీరోకు లభించిన అత్యధిక పారితోషికంగా రికార్డు సృష్టించింది.
గతంలో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ రికార్డును తన పేరు మీద నిలబెట్టుకున్నారు. ఆయన కొన్ని సినిమాలకు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ మార్క్‌ను బ్రేక్ చేస్తూ, అల్లు అర్జున్ అగ్ర స్థానాన్ని ఆక్రమించారు. ఈ పరిణామం ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించింది.
ఈ రికార్డు వార్త తెలిసిన బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. “ఇది కేవలం ఆరంభం మాత్రమే, రాబోయే ప్రాజెక్టులతో బన్నీ హాలీవుడ్ స్థాయికి వెళ్తాడు” అంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ‘తగ్గేదేలే’ అన్నది కేవలం డైలాగ్ కాదు, అది ఇప్పుడు అల్లు అర్జున్ మార్కెట్ స్టేట్మెంట్గా మారిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అట్లీ డైరెక్షన్లో రాబోయే ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
