Mahavatar: విక్కీ కౌశల్ ‘మహావతార్’ గురించి అమర్ కౌశిక్ క్లారిటీ
Mahavatar: బాలీవుడ్‌లో ‘స్త్రీ 2’ వంటి భారీ విజయాన్ని అందించిన దర్శకుడు, నిర్మాత అమర్ కౌశిక్, తదుపరి విక్కీ కౌశల్‌తో ‘మహావతార్’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. పౌరాణిక అంశాలతో కూడిన ఈ చిత్రం గురించి ఇండస్ట్రీలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అమర్ కౌశిక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించి, ఆ వార్తలపై స్పష్టత ఇచ్చారు.
‘మహావతార్’ చిత్రం ఆగిపోయిందని వస్తున్న వార్తలను అమర్ కౌశిక్ ఖండించారు. ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకమైనదని తాను ఇప్పటివరకు తీసిన సినిమాల కంటే భిన్నమైనదని ఆయన తెలిపారు. “గత ఆరు నెలలుగా, సినిమా సెట్టింగ్‌లు, ప్రత్యేకమైన ఆయుధాల తయారీ, ప్రతి పాత్ర డిజైనింగ్ వంటి స్క్రిప్ట్ పనులపై సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇదొక భారీ ప్రాజెక్ట్ కావడం వలన మాకు మరింత సమయం కావాలి” అని ఆయన వివరించారు. ఈ లోగా హీరో విక్కీ కౌశల్ తన ఇతర కమిట్‌మెంట్‌లను పూర్తి చేసుకుంటారని వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
‘మహావతార్’ ప్రాజెక్ట్ తనకి ఎంత ప్రత్యేకమైనదో అమర్ కౌశిక్ వివరించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని స్కూల్లో చదువుకునే రోజుల్లోనే తమ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పరశురామ్ కుండ్ గురించి తన తల్లిని తరచుగా అడిగేవారట. పరశురాముడి గురించి ఎక్కువ మాట్లాడకూడదని, ఆయన చాలా కోపంగా ఉంటారని ఆమె చెప్పేవారట. ఈ కారణం చేతనే ఆ పాత్రపై తనకు చిన్ననాటి నుంచే ఆసక్తి పెరిగిందని, ఎప్పటికైనా దానిపై సినిమా తీయాలని భావించానని ఆయన పంచుకున్నారు.
ప్రస్తుతం VFX (విజువల్ ఎఫెక్ట్స్) టెక్నాలజీపై తనకు మంచి పట్టు రావడంతోనే ఈ సినిమాను ప్రారంభించడానికి ఆత్మవిశ్వాసం వచ్చిందని అమర్ కౌశిక్ అన్నారు. దీంతో విక్కీ కౌశల్ పౌరాణిక పాత్రలో నటించే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.