Anushka Shetty’s Birthday : అభినయానందాల పేటి అనుష్కశెట్టి నేస్తమా, నేస్తమా అంటూ తెలుగు సినిమాతోటలో పున్నమి పువ్వై వికశించింది. మందార ,మందార అంటూ కళ్ళ ముందర కదలాడిన ప్రేక్షక మనో సామ్రాజ్య అంతఃపురంలో అందాల చిలక. అవునా నీవేనా దర్శక నిర్మాతలు వెతుకుతున్న నిధి నీవేనా.. అని ప్రశ్శించిన ఆభిమానుల ఎదలో నిదురించు కాంతి. అందాల నావలో దివి నుంచి భువికి దిగివచ్చిన దేవసేన .సినీవినీలాకాశంలో కాంతిలీనుతున్న ఆరుంధతి. నటనా పరాక్రమానికి ప్రతిరూపం ఈ రుద్రమదేవి. అత్తిలి సత్తిబాబుని ఆట పట్టించిన అందగత్తె. డాన్ తో డాన్స్ చేసిన డ్యాంసింగ్ డాల్. చింతకాయల రవి చిత్తాన్ని దోచుకున్న సునీత ఈ ముదిత..
రంగు రంగు వానలో చెంగుచెంగు మంటూ నాణ్య మాడిన నాజుకు జాణ ఈ బొమ్మాళి. జిరోసైజ్ లాంటి వినూత్న పాత్రలలో సైతం నటించి హిరోలతో పాటు సమానమైన క్రేజ్ ను సొంతంచేసుకున్న భాగమతి. జీవన వేదాన్ని పంచినా కోనేటి రాయునికి కోటి దండాలు ఆర్పించిన నటనా కల్పవల్లి ఈ నాగవల్లి. దర్శక నిర్మాతల పాలిట భాగ్యమతి ఈ భాగమతి. తనదైన నటనతో జేజేలు పలికించుకున్న జేజమ్మ. ముగ్ధమోహన సౌందర్యం, ఆకట్టుకునే అభినయంతో టాలీవుడ్లో అగ్రకథానాయికగా కొనసాగుతోంది ఈ కన్నడ బామ.
అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. 1981 నవంబరు 7న కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో జన్మించింది. తండ్రి ఎ.ఎన్. విఠల్ శెట్టి, తల్లి ప్రఫుల్లా శెట్టి. మంగుళూరులో పుట్టిపెరిగిన అనుష్క పాఠశాల, కళాశాల విద్యాభ్యాసమంతా బెంగుళూరులోనే కొనసాగింది. బీసీఏలో డిగ్రీ పూర్తిచేసిన స్వీటీ, తర్వాత ఫిట్నెస్ రంగంపై ఉన్న ఆసక్తితో ఆ దిశగా శిక్షణ తీసుకోని బెంగుళూరులో యోగా శిక్షకురాలిగా స్థిరపడింది. అయితే స్వీటీ గురువు ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్‌ఠాకూర్, నటుడు అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో ఆమె నటిగా వెండితెరకు పరిచయమైంది.
2005లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమా ద్వారా అనుష్క వెండితెరపైకి అడుగుపెట్టారు. అలా ‘సూపర్’ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆమె కీర్తి ఇటీవల వచ్చిన ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తమయింది. నాగార్జునకు జోడీగా అత్యధిక చిత్రాల్లో కనిపించిన అనుష్క ‘అక్కినేని’ కుటుంబ హీరోయిన్గా ప్రాచుర్యం పొందారు. ‘సూపర్’, ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘నమో వెంకటేశాయా’, ‘ఊపిరి’ తదితర చిత్రాల్లో నాగ్‌తో తెర పంచుకున్నారు.
నాగార్జున మేనల్లుడు సుమంత్ సరసన ‘మహానంది’ సినిమాలోనూ నటించింది. ఆ చిత్రంలో అనుష్క నటనకు మంచి పేరు రావడంతో.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ‘విక్రమార్కుడు’ సినిమాకు కథానాయికగా ఎంపికైంది. అందులో రవితేజకు జోడీగా స్వీటీ నటన ఎంతగానో ఆకట్టుకోవడంతో.. తెలుగు సినీ పరిశ్రమలో విరామంలేని కధానాయికగా మారిపోయింది. కథానాయికగా మంచి అవకాశాలు దక్కించుకోవడంలో అనుష్క ఎత్తు, అందం ఆమెకు చాలా పెద్ద అనుకూలంశాలయ్యాయి.
ఓవైపు చిరంజీవి లాంటి అగ్రకథానాయకులతో (స్టాలిన్) నటించి.. అనుష్క యువహీరోలతోనూ నాయికగా జత కట్టి మెప్పించింది. మంచు విష్ణుతో ‘అస్త్రం’, గోపీచంద్‌తో ‘లక్ష్యం’, ‘శౌర్యం’, బాలకృష్ణతో ‘ఒక్కమగాడు’, జగపతి బాబుతో ‘స్వాగతం’, వెంకటేష్‌తో ‘చింతకాయల రవి’, ‘నాగవల్లి’, అల్లుఅర్జున్, మంచు మనోజ్‌లతో ‘వేదం’, రవితేజతో ‘బలాదూర్’, మహేష్‌బాబుతో ‘ఖలేజా’, రానాతో ‘రుద్రమదేవి’, ప్రభాస్‌తో ‘బిల్లా’, ‘మిర్చి’తో పాటు ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ నటించి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంది. ఇలా అగ్రశ్రేణి కథానాయకులందరితోనూ నటించి మెప్పించిన అనుష్క సినిమా కెరీర్లో మైలురాయిగా నిలచిన చిత్రం ‘అరుంధతి’.
ఈ చిత్రంలో అరుంధతిగా, జేజెమ్మగా రెండు పాత్రల్లో అనుష్క కనబరిచిన నటన ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. ‘అరుంధతి’ సినిమా విజయం తర్వాత నాయికా ప్రాధాన్యమున్న కథలన్నీ అనుష్క కోసం వరుస కట్టాయి. వీటిలో ‘పంచాక్షరి’, ‘సైజ్‌జీరో’ నిరాశపర్చగా.. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రమదేవి’ అద్భుత విజయాన్నందుకుంది. ఓవైపు తెలుగులో నటిస్తూనే తమిళ చిత్రాలతోనూ అనుష్క మంచి పేరు తెచ్చుకుంది. వీటిలో సూర్యతో నటించిన ‘సింగం’, ‘సింగం−2’ సినిమాలు భారీ హిట్లందుకున్నాయి.
వీటితో పాటు ‘వానం’, ‘దివ్య తిరుమగల్’, ‘తాండవం’, ‘అలెక్స్ పాండియన్’, ‘ఇరందామ్ ఉళగం’, ‘లింగా’, ‘ఎన్నయ్ అరిందాల్’ సినిమాలు కూడా అనుష్కకు మంచి విజయాల్నందించాయి. ఇక ఇటీవల తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ‘భాగమతి’ చిత్రంతో అనుష్క మరోసారి ప్రేక్షకులను అలరించింది. బాహుబలి తో జతకట్టిన ఈ బొమ్మాళి దేవసేనగా ‘ అదరగొట్టిన అనుష్క. ఈఏడాది ‘భాగమతి’తో మరోసారి అభిమానుల మనసులను దోచుకుంది. ఇందులో చంచలగా, భాగమతిగా రెండు విభిన్నపాత్రల్లో అనుష్క చూపిన అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి.
అగ్రకథానాయకుల చిత్రాలకు దీటుగా ‘భాగమతి’ వసూళ్లు సాధించడంతో ఇప్పుడు అందరి చూపు స్వీటీ అనుష్కపైనే పడింది. ఇప్పటివరకు అనుష్క తెలుగు, తమిళ భాషల్లో దదాపు 50 చిత్రాల్లో నటించింది. .2009 ఆరుంధతి సినిమాకి ఫిలింఫేర్ (ఉత్తమనటి అవార్డు) నంది ప్రత్యేక జ్యూరీఅవార్డు 2010 వేదం చిత్రంలో సరోజ పాత్రకు ఫిలింఫేర్ (ఉత్తమనటి అవార్డు 2010 నాగవల్లి (చంద్రమిఖి) తెలుగు పాత్రకు ఫిలింఫేర్ (ఉత్తమనటి అవార్డు) సోంతం చేసుకున్న భాగ్యవతి మా జేజమ్మ జెజేలు ఆందుకోవమ్మా. అనుష్క గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు
~ శ్రీధర్ వాడవల్లి –