Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘శంకర వరప్రసాద్’ రచ్చ.. హై వోల్టేజ్ క్లైమాక్స్ షూటింగ్ షురూ
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది శుభవార్త. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకి సంబంధించిన అత్యంత కీలకమైన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను హైదరాబాద్‌లో ఆదివారం నుంచి ప్రారంభించారు.
చిత్ర వర్గాల సమాచారం ప్రకారం, ఈ భారీ పోరాట ఘట్టం ప్రేక్షకులకు ఒక మరిచిపోలేని అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఫైటర్ల బృందంపై తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్, చిరంజీవి మార్క్ స్టైల్, అనిల్ రావిపూడి టేకింగ్ కలయికతో పండుగ లాంటి అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవిని సరికొత్త కోణంలో చూపించబోతున్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి అపారమైన చరిష్మా, అనిల్ రావిపూడి పక్కా వినోదాత్మక శైలి మేళవింపుతో ఈ సినిమా అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. మరో విశేషమేమిటంటే, ఈ సినిమాలో ‘విక్టరీ’ వెంకటేశ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు, ఇది మెగా అభిమానులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
