Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Idli Kottu: నటుడు, దర్శకుడు ధనుష్, నిత్యా మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరు 1న థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ దర్శకుడిగా, హీరోగా ధనుష్ చేసిన ఈ ప్రయత్నం గ్రామీణ నేపథ్యం అలాగే విజయవంతమైన ‘తిరు’ చిత్రం తర్వాత ధనుష్, నిత్యా మేనన్ జంటగా నటించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో వినోదాన్ని అందించడంలో ఈ సినిమా వెనుకబడిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయినప్పటికీ ఇప్పుడు ఓటీటీ వేదికగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
‘ఇడ్లీ కొట్టు’ సినిమా అక్టోబరు 29వ తేదీ నుంచి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. థియేటర్లో మిస్సయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా కథ ప్రధానంగా శివ కేశవులు (రాజ్‌కిరణ్) అనే వ్యక్తి నడిపే ప్రసిద్ధి చెందిన ఇడ్లీ కొట్టు చుట్టూ తిరుగుతుంది. రుచికరమైన ఇడ్లీలకు ఆ ఊళ్లో ఆ కొట్టుకు ఎంతో పేరు ఉంటుంది. శివ కేశవులు కొడుకు మురళి (ధనుష్) ఆధునిక భావాలు గల యువకుడు. తండ్రి నడుపుతున్న ఆ కొట్టును ఫ్రాంచైజీగా మార్చి, డబ్బు సంపాదించాలనే కోరిక అతడికి ఉంటుంది. అయితే, తన చేతులతో చేయని ఇడ్లీలను తన పేరుతో అమ్మడానికి శివ కేశవులు ససేమిరా ఒప్పుకోడు. దాంతో మురళి, తన ఆశయాల కోసం కన్నవారిని, ఊరిని వదిలి పట్టణం బాట పడతాడు.
మురళి ప్రయాణం బ్యాంకాక్‌కు చేరుతుంది. అక్కడ బిజినెస్ పార్ట్నర్ విష్ణువర్థన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలిని పాండే)తో పెళ్లి నిశ్చయమవుతుంది. పెళ్లి కొద్దిరోజుల్లో ఉందనగా, మురళి తండ్రి శివ కేశవులు మరణిస్తాడు. తండ్రి చివరి చూపు కోసం ఊరికి వచ్చిన మురళి తిరిగి బ్యాంకాక్ వెళ్లాడా? తండ్రి మరణానంతరం ఆయన ఇడ్లీ కొట్టు పరిస్థితి ఏమైంది? మురళి, కల్యాణి (నిత్యా మేనన్) మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? మీరాతో మురళి పెళ్లి జరిగిందా? అనే ఆసక్తికర అంశాలతో ఈ కథ ముందుకు సాగుతుంది. మానవీయ విలువలు, ఆధునిక పోకడలకు మధ్య జరిగే ఘర్షణే ఈ సినిమా ముఖ్య నేపథ్యం.
