Yellamma: ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌పై క్లారిటీ… హీరో, హీరోయిన్‌ల విషయంలో తొలగిన సస్పెన్స్
Yellamma: ‘బలగం’ వంటి సంచలన చిత్రాన్ని అందించిన దర్శకుడు వేణు ఎల్దండి (బలగం వేణు) ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ అనౌన్స్‌మెంట్ రోజు నుంచి వరుస ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ సినిమా ప్రకటించిన రెండేళ్ల తర్వాత కూడా ఇందులో నటించే హీరో ఎవరనే విషయంలో తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, హీరోల మార్పుతో దీని భవితవ్యంపై ప్రశ్నలు తలెత్తాయి.
మొదట ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తారని ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల నాని తప్పుకున్నారు. ఆ తర్వాత శర్వానంద్ ఎంట్రీ ఇచ్చి, కొంతకాలం తర్వాత ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. చివరిగా హీరోగా నితిన్ పేరు ఖరారైందని, షూటింగ్ కూడా త్వరలో మొదలవుతుందని స్వయంగా నితిన్ ప్రకటించినా, కొద్ది రోజులకే ఆయన కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
వరుసగా ముగ్గురు అగ్ర హీరోలు తప్పుకోవడంతో ‘ఎల్లమ్మ’ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధతకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెరదించారు. గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. “ఎల్లమ్మ సినిమాకు హీరో ఇప్పటికే ఫైనల్ అయ్యాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తాం. అలాగే హీరోయిన్ వివరాలను కూడా డిసెంబర్‌లో వెల్లడిస్తాం” అని దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే అన్ని అవాంతరాలు ఎదురైనా సినిమాను కొనసాగిస్తున్నామని మేకర్స్ సంకేతాలిచ్చారు.
మరోవైపు తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి 2026లో ఆరు సినిమాలు రిలీజ్ అవుతాయని, వాటి వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన్’ సినిమా షూటింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. ‘బలగం’తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన వేణు ఎల్దండి తన రెండో చిత్రం ‘ఎల్లమ్మ’తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కొత్త హీరో, హీరోయిన్ ప్రకటనపైనే ఉంది.
