Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరో హిట్ ఖాయమేనా?
Swayambhu: ‘కార్తికేయ 2’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ కొట్టిన యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియడ్ వార్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో నిరాశలో ఉన్న అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది.
ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా, ఏకంగా ‘పాన్ వరల్డ్’ రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ విజువల్ వండర్ 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సినిమా స్కేల్ ఎంత పెద్దదో చెప్పడానికి రిలీజ్ ప్లానింగే నిదర్శనం. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వంటి మన దేశీయ భాషలతో పాటు.. అంతర్జాతీయ భాషలైన చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మొత్తంగా 8 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. విడుదల తేదీ ప్రకటనతో పాటు ‘రైజ్ ఆఫ్ స్వయంభు’ పేరుతో విడుదల చేసిన స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చూపించిన యుద్ధ సన్నివేశాలు, భారీ సెట్టింగులు, నిఖిల్ సరికొత్త లుక్ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. అగ్రశ్రేణి సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ అందిస్తున్న విజువల్స్, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలాలు కానున్నాయి.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో కథానాయికలుగా సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. వీరి పాత్రలను కూడా కథలో చాలా కీలకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, విజువల్స్ పరంగా, కథా పరంగా ఇండియన్ స్క్రీన్‌పై కొత్త చరిత్ర సృష్టిస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది. 2026లో రాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రమోషనల్ కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
