Bigg Boss: రంగంలోకి కర్ణాటక డిప్యూటీ సీఎం.. తెరుచుకున్న కన్నడ బిగ్‌బాస్ డోర్స్
Bigg Boss: కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన బిగ్‌బాస్ కన్నడ రియాలిటీ షోకి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలికంగా మూతబడిన ఈ బిగ్‌బాస్ హౌస్‌ను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాల మేరకు తిరిగి తెరిచారు.
కాలుష్య నియంత్రణ మండలి అధికారుల చర్యల కారణంగా మంగళవారం నాడు బెంగళూరు రూరల్ జిల్లా, బిడదిలోని ‘జాలీవుడ్’ స్టూడియోలో ఉన్న బిగ్‌బాస్ హౌస్‌ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్టూడియో నుంచి నిత్యం సుమారు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని వ్యర్థ జలం నేరుగా బయటకు విడుదల అవుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై కాలుష్య నియంత్రణ మండలి (PCB) గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ, షో నిర్వాహకులు వాటిని పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ తేజస్విని అధికారులతో కలిసి వచ్చి బిగ్‌బాస్ భవనానికి తాళాలు వేశారు.
ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. ఈ అంశాన్ని పరిశీలించిన ఆయన, కన్నడ వినోద పరిశ్రమకు మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూనే, పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ మేరకు, స్టూడియో యాజమాన్యానికి మరో అవకాశం ఇస్తూ, సీజ్‌ను ఎత్తివేయాలని ఆయన బెంగళూరు సౌత్ డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని డీకే శివకుమార్ తమ అధికారిక ఎక్స్ వేదికగా కూడా స్పష్టం చేశారు. “పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో కన్నడ వినోద పరిశ్రమకు మేం అండగా ఉంటాం” అని ఆయన పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల బిగ్‌బాస్ కన్నడ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కిచ్చా సుదీప్ సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి గందరగోళాలకు తావు లేకుండా, సరైన సమయంలో స్పందించినందుకు డీకే శివకుమార్‌కు, అలాగే ఈ సమస్య పరిష్కారంలో సహకరించిన సంబంధిత అధికారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీకేఎస్ ఆదేశాలతో బిగ్‌బాస్ హౌస్ తెరుచుకోవడంతో షూటింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.
