Mohan Lal: ఏనుగు దంతాల కేసులో మోహన్‌లాల్‌కు ఎదురుదెబ్బ..
Mohan Lal: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇంట్లో లభించిన ఏనుగు దంతాల (ఐవరీ) కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో కేరళ హైకోర్టు తాజాగా కీలకమైన సంచలన తీర్పును వెలువరించింది. నటుడి వద్ద ఉన్న ఏనుగు దంతాల సేకరణను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్స్ చట్టవిరుద్ధమని న్యాయపరంగా అమలు చేయడానికి అనర్హమని కోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ ఏ.కె. జయశంకరన్ నంబియార్, జస్టిస్ జోబిన్ సెబాస్టియన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. 2016 జనవరి మరియు ఏప్రిల్ నెలల్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ద్వారా మోహన్‌లాల్‌కు జారీ చేసిన యాజమాన్య పత్రాలతో పాటు, వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు పూర్తిగా కొట్టివేసింది.
ఈ ఉత్తర్వులు జారీ చేసే సమయంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని నిబంధనలను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని న్యాయస్థానం పేర్కొంది. ముఖ్యంగా సెక్షన్ 44 ప్రకారం తప్పనిసరిగా జరగాల్సిన ‘అధికారిక గెజిట్ ప్రచురణ’ ప్రక్రియ జరగలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ విధానపరమైన లోపం కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లనివిగా పరిగణించబడతాయని ధర్మాసనం పేర్కొంది.
అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు తెలిపింది.
ఈ తీర్పుతో మోహన్‌లాల్‌పై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసు విచారణకు ఎలాంటి అడ్డంకి ఉండబోదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ యాజమాన్య ధృవీకరణ పత్రాలు ఎలా జారీ చేయబడ్డాయనే అంశంపై తాము వ్యాఖ్యానించడం లేదని, ఎందుకంటే అలా చేస్తే క్రిమినల్ కేసు విచారణపై ప్రభావం పడుతుందని బెంచ్ పేర్కొంది.
2012లో మోహన్‌లాల్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో రెండు జతల ఏనుగు దంతాలు లభించాయి. సరైన అనుమతులు లేకపోవడంతో అటవీ శాఖ ఆయనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఆయనకు యాజమాన్య పత్రాలు మంజూరు చేయగా, వాటిని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఆధారంగానే హైకోర్టు తాజాగా ఈ కీలక తీర్పును వెలువరించింది.
