Mahakali: ప్రశాంత్‌వర్మ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’ ఫస్ట్ లుక్.. తొలి ఫీమేల్ సూపర్ హీరో!
Mahakali: ‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో అపారమైన అభిమానాన్ని, విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి మరో సంచలనాత్మక చిత్రం రాబోతోంది. ‘జై హనుమాన్’ సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్న వేళ, ఈ యూనివర్స్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం ‘మహాకాళి’ గురించి సినీ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది.
ఈ చిత్రం భారతదేశం నుంచి వస్తున్న మొట్టమొదటి ఫీమేల్ సూపర్ హీరో మూవీ కావడం విశేషం. ఈ అసాధారణ ప్రాజెక్టుకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు, దీనికి ప్రశాంత్‌వర్మ కథ అందిస్తున్నారు. ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషిస్తున్న కథానాయిక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మహాకాళి పాత్రలో కన్నడ నటి భూమిశెట్టి నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్‌లో భూమిశెట్టి ఉగ్రరూపంలో, శక్తివంతమైన మహాకాళి పాత్రకు పూర్తిగా న్యాయం చేసే విధంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాత్ర శక్తి, విశ్వాసం, భారతీయ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని మేకర్స్ తెలియజేశారు.
ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా కూడా శుక్రాచార్యుడి పాత్రలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. బెంగాల్ నేపథ్యంగా, శక్తివంతమైన కాళీదేవి ప్రధానంగా ఈ కథాంశం నడుస్తుంది.
‘మహాకాళి’ చిత్రాన్ని కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా, పలు విదేశీ భాషల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ దృశ్య కావ్యాన్ని ఐమాక్స్ త్రీడీ ఫార్మాట్‌లో కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చని నిర్మాతలు పేర్కొన్నారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, ఈ చిత్రానికి స్మరణ్‌సాయి సంగీతాన్ని అందిస్తుండగా, శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ప్రశాంత్‌వర్మ మార్గదర్శకత్వంలో, ఈ ఫీమేల్ సూపర్ హీరో సినిమా భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
