Manohar – Chandrababu : తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ పని తీరుతో రాష్ట్రాన్ని నెగిటివ్ రోల్లోకి నెట్టేశారు. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారిని అరెస్టు చేయించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు.
ఎప్పుడో మూడేళ్ల క్రితం రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ పేరుతో చంద్రబాబు గారిని అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత వ్యవహార శైలికి పరాకాష్టగా నిలుస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలపై స్పందించి, మాట్లాడే విపక్షాల గొంతు నొక్కేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, పాలనా వ్యవస్థలను వ్యక్తిగత కక్ష. తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటుందని తెలిపారు.
దేశంలో జీ 20 సదస్సు వైభవంగా జరుగుతుంటే రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఎలా తీసుకొని రావాలి… పరిశ్రమలు ఎలా రప్పించాలి అని ఆలోచించాల్సిన ప్రభుత్వం విపక్షాలపై అడ్డగోలుగా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టినప్పుడు కూడా పోలీసులు పవన్ కళ్యాణ్ గారితో మా పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించారు.
ప్రజలను కలుసుకోనివ్వకుండా చేసి అక్రమంగా హత్యాయత్నం కేసులను మా పార్టీ నాయకులు పై మోపారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునేందుకు మూడు, నాలుగు నెలల నుంచి ప్రయత్నం జరుగుతోంది. ఏదో విధంగా కేసులు పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. చట్టపరమైన ప్రొసీజర్ కు వ్యతిరేకంగా పోలీసులు ప్రవర్తించడం సరికాదు.
ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లకుండా కావాలనే ఈ ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ పార్టీ కూడా పోటీకి ఉండకూడదు అనేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం వారి వ్యవహార శైలిని తెలియపరుస్తోంది. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్య వాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉంది అన్నారు.