Nagarjuna Tabu: నాగార్జున-టబు కాంబోలో మూవీ.. దశాబ్దాల తర్వాత కలిసిన క్రేజీ జోడీ
Nagarjuna Tabu: వెండితెరపై కొన్ని జంటలకు ఉండే క్రేజే వేరు. అలాంటి హిట్ కాంబినేషన్లలో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ నటి టబు జంట ఒకటి. ‘సిసింద్రీ’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో ఈ జంట అప్పట్లో యూత్‌లో ఒక కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే, వీరిద్దరూ కలిసి నటించి సుమారు రెండు దశాబ్దాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో, ఈ హిట్ పెయిర్‌ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక అదిరిపోయే అప్‌డేట్!
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రంలో టబు ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట. ఈ వార్తకు సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, అక్కినేని అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఈ కబురును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ మైలురాయి చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. సినీ పరిశ్రమలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు కథానాయికలు ఉండనున్నారు. వీరిలో ఒక ముఖ్యమైన పాత్రలో టబు కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టబు తెలుగులో పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకవేళ ‘నాగ్ 100’ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే, ఈ సీజన్‌లో ఆమె తెలుగులో చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. టబు రీ-ఎంట్రీ, నాగార్జున మైలురాయి చిత్రానికి మరింత హైప్‌ను, ప్రత్యేకతను తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.
ఇటీవల ‘కూలీ’ చిత్రంలో తొలిసారిగా నెగెటివ్ షేడ్స్‌లో కనిపించి ఆకట్టుకున్న నాగార్జున, రా కార్తీక్‌తో ఎలాంటి వైవిధ్యమైన కథ చేయబోతున్నారన్నది సినీ ప్రియులందరిలోనూ ఉత్కంఠను పెంచుతోంది. మేకర్స్ ఈ సినిమాను 2026 మే నెలలో సమ్మర్ కానుకగా అభిమానుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
