Nadendla Manohar : బటన్లు నొక్కుతున్నాం.. డబ్బు ఇస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల్ని పూర్తిగా విస్మరించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రమాదంలో వ్యక్తి చనిపోతే కనీస ఆర్ధిక సాయం అందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.బాధ్యతగల రాజకీయ పార్టీగా జనసేనా కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే
రూ.5 లక్షల బీమాను ఇస్తుంటే , ప్రభుత్వం ప్రమాద బీమా రూ.2 లక్షలు కూడా ఎగ్గొట్టాలని చూడడం సిగ్గుచేటు అన్నారు. జగన్ రెడ్డి ప్రజల పేరు చెప్పి లక్షల కోట్ల అప్పులు ఎవరి కోసం చేస్తున్నారు అని నిలదీశారు. నాదెండ్ల మనోహర్ ఆదివారం మధ్యాహ్నం ఉమ్మడి ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం పరిధిలోని తోట వెంగన్నపాలెంకు చెందిన క్రియాశీలక సభ్యుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ చెట్లు మోహనరావు కుటుంబాన్ని పరామర్శించి.
పార్టీ తరఫున రూ. 5 లక్షల బీమా -చెక్కును అతని భార్య శ్రీమతి ధనలక్ష్మికి అందచేశారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధ్యతగా ఉన్న కుటుంబానికి భరోసా కల్పించాలన్న లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకువచ్చినట్టు తెలిపారు. అనంతరం నాదెండ్ల మనోహర్ వెంగన్నపాలెం గ్రామంలో స్థానిక పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన జనసేన జెండా స్థూపాన్ని ప్రారంభించి జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పార్టీ తాళ్లూరు మండల అధ్యక్షుడు శ్రీ తూటాల ప్రసాద్ గ్రామ సమస్యలను శ్రీ మనోహర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి వ్యవస్థ నిర్వహణ లేక మూలనపడడంతో వెంగన్నపాలెం గ్రామస్తులు తాగునీటి కోసం రెండు కిలోమీటర్ల దూరం వెళ్ల వలసి వస్తుందని, గోతులతో రోడ్డు చిద్రంగా మారితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరమ్మతులు చేసిన విషయాన్ని మనోహర్ గారూ తెలిపారు.
దర్శి నియోజకవర్గంలో మనోహర్ చీమకుర్తి, సోమవరప్పాడు, తూర్పు గంగవరం తదితర గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. దారి పొడుగునా పూల వర్షం కురిపించారు. సోమవరప్పాడు గ్రామంలో వెలసిన శ్రీ గంటి గంగాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, దర్శి ఇంచార్జ్ శ్రీ బొటుకు రమేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్, అధికార ప్రతినిధులు డాక్టర్ గౌతమ్, శ్రీమతి రాయపాటి అరుణ, పార్టీ నేతలు మలగా రమేష్. బెల్లంకొండ సాయిబాబు, వరికూటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.