Nayanthara: సినీ ఇండస్ట్రీకి వచ్చాక ఎంతో మారిపోయా.. 22 ఏళ్ల కెరీర్‌పై నయనతార నోట్
Nayanthara: తన అద్భుతమైన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో దక్షిణాది సినిమా పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా స్థిరపడిన నటి నయనతార సినీ ప్రయాణంలో ఓ అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ఆమె వెండితెర అరంగేట్రం చేసి నేటికి 22 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా, నయనతార సోషల్ మీడియా వేదికగా అభిమానులను, తన ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ ఉద్దేశిస్తూ ఓ భావావేశపూరితమైన లేఖను పంచుకున్నారు.
సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలిరోజులను గుర్తుచేసుకుంటూ నయనతార తన నోట్లో, “మొదటిసారి కెమెరా ముందు నిలబడి 22 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ సమయంలో సినిమాలే నా ప్రపంచంగా మారతాయని అస్సలు ఊహించలేదు. పరిశ్రమలోకి వచ్చిన తర్వాత, నేను అనుకోని ప్రయాణం మొదలైంది. షూటింగ్లో నేను పాల్గొన్న ప్రతి షాట్, తెరపై ప్రతి ఫ్రేమ్, ఆ సెట్స్‌లోని నిశ్శబ్దం… ఇవన్నీ నన్ను పూర్తిగా మార్చేశాయి. ఈ వాతావరణమే నాకు అపరిమితమైన ధైర్యాన్ని ఇచ్చింది, నన్ను నేనుగా నిలబెట్టింది” అని ఆమె పేర్కొన్నారు. తన కెరీర్ ఎదుగుదలలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని నయనతార ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
2003లో మలయాళ చిత్రం ‘మనస్సినక్కరే’తో నయనతార సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత, తమిళ, తెలుగు భాషల్లో ఆమె వెనుదిరిగి చూడలేదు. ‘చంద్రముఖి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కేవలం అగ్ర కథానాయకుల సరసన నటించడమే కాకుండా, తన భుజాలపై సినిమా భారాన్ని మోస్తూ, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఘన విజయాలు అందుకున్నారు. ఇటీవల, ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్లో కూడా తన ముద్ర వేశారు.
ప్రస్తుతం నయనతార చేతిలో దాదాపు 8 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్లో రానున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ఒకటి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. నయనతార ఈ స్థాయిలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేయడం, 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడం ఆమె అభిమానులకు, చిత్ర పరిశ్రమకు గర్వకారణం.
