NTR Neel: జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రిషబ్ శెట్టి.. గట్టిగానే ప్లాన్ చేశారు మైక్
NTR Neel: ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఒక ఆసక్తికరమైన అతిథి పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి మెరవనున్నారని సినీ వర్గాల్లో ఒక వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ‘కాంతారా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రిషబ్ శెట్టి, ఎన్టీఆర్-నీల్ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, ఈ కాంబినేషన్ ఈ సినిమాకు మరింత హైప్‌ను తీసుకురావడం ఖాయం.
ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన వార్త కూడా వెలుగులోకి వచ్చింది. తన కొత్త సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఇటీవల హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌ను సందర్శించారు. అక్కడ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో తారక్ సమావేశమయ్యారు. ఈ భేటీ గురించి లారా విలియమ్స్ స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘ఎన్టీఆర్‌ని కాన్సులేట్‌కి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రస్తుత, భవిష్యత్ చిత్రాలు అమెరికా, భారతదేశం మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని నేను నమ్ముతున్నాను’ అని ఆమె పోస్ట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్పందించారు. ఈ పరిణామం బట్టి, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలోని కొన్ని కీలక భాగాలను అమెరికాలో చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తనను తాను పూర్తిగా శారీరకంగా సిద్ధం చేసుకుంటున్నారు. జిమ్‌లో ఆయన చేస్తున్న తీవ్రమైన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ భారీ కాంబినేషన్, కథనం, మరియు అంతర్జాతీయ షూటింగ్ లొకేషన్లతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడం ఖాయం.
