Pawan Kalyan – C.C.A.A : సాంకేతిక కారణాలతో యువతను ఆందోళనలోకి నెట్టవద్దు. సి. సి. ఎ.ఎ అర్హత సాధించిన వారి కోసం పవన్ కళ్యాణ్ వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మద్దతు తెలిపారు. యువతకు నష్టం కల్పించే విధంగా ప్రభుత్వ విధానం ఉందని ఆయన వెల్లడించారు. రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించాలి. రైల్వే సాంకేతిక విభాగంలో ఉద్యోగాల కోసం అన్ని అర్హతలు కలిగి, నిర్దేశిత పరీక్షల్లో ఉత్తీర్ణత కలిగిన యువతకు
నియామకాలు ఇవ్వకుండా పెండింగ్ లో ఉండమని ప్రకటన ఇవ్వడం దురదృష్టకరం. 2019లో జారీ అయిన ఉద్యోగ ప్రకటన ఆధారంగా ఈ ఏడాది చేపట్టిన నియామకాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో 400 మందిని పెండింగ్ లో ఉంచుతూ ప్రకటన ఇవ్వడంతో యువత నిరాశా,నిస్పృహలకు లోనవుతోంది. సంబంధిత ఉద్యోగాలకు రైల్వే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ (సి.సి.ఎ.ఎ.) ఉద్యోగ ప్రకటన నాటికి సాధించి ఉండాలని చెప్పారు.
అప్పటికి కోర్సు పూర్తి చేసినా స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నిర్దేశిత సమయంలో పరీక్షలు నిర్వహించలేదు. అయినా ఉద్యోగ రాత పరీక్షకు అనుమతి ఇచ్చారు. నియామకం సమయానికి అన్ని అర్హతలూ ఉన్నా ప్రకటన నాటికి సర్టిఫికేట్ లేదు అనే సాంకేతిక కారణంతో అర్హత సాధించిన వారి నియామకాన్ని పెండింగ్ లో ఉంచడం వల్ల సంబంధిత యువత ఆందోళనలో ఉంది. ఆ యువత తమ బాధను నా దృష్టికి తీసుకువచ్చారు.
వారి మానసిక వేదనను రైల్వే మంత్రిత్వ శాఖ అర్ధం చేసుకొని సానుకూలంగా స్పందించాలి. అర్హులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. ఇదే సమస్య కలిగిన ఇతర రాష్ట్రాల్లో.. అక్కడి రైల్వే జోన్ల అధికారులు అన్ని పరిశీలనలు చేసి ఉద్యోగాలు కల్పించిన దృష్టాంతాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నాను. ఈ సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే మంత్రిత్వ శాఖతో చర్చలు చేయాలి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.