Pawan Kalyan in Tenali : మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది.
అక్కడ సీటు, గెలుపూ మనదే అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్ధంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబధ్ధతను వెల్లడించాయన్నారు.
అటువంటి సమర్థ నాయకుడినీ, ఎన్నుకున్న నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్దినీ తెనాలి ప్రజలు ఎప్పటికీ మరచిపోరు అని చెప్పారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులను ఒక్కక్కరినీ మనోహర్ గారు పరిచయం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ” మనోహర్ గారు తన హయాంలో చేసిన సేవలను తెనాలి నియోజకవర్గం ప్రజలు విస్మరించలేదు.
ఇప్పటికీ నియోజకవర్గం అభ్యున్నతి కోసం తపిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెనాలికి ఆయన అవసరం ఉంది. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా పాలక పక్షం ఆలోచిస్తుంది.
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు అంటారు.. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు… నేను బాగుండాలి.. నేనే బాగుపడిపోవాలి అనేది వైసీపీ నాయకుడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి, దాన్ని నేనెప్పుడో గ్రహించాను కాబట్టి మొదటి నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తున్నాను. ప్రజలు మాత్రం ఎంతో సానుభూతితో తండ్రి లేని పిల్లాడు.. సంవత్సరం నుంచి నడుస్తున్నాడని జాలితో ఓట్లు వేశారు. ఇప్పుడు దానికి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడుతున్నారు.. అని పవన్ వెల్లడించారు.