Pawan Kalyan – Pendurthi : వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి అడుగులో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు బయటికి వస్తున్నారంటే ఆ ఆంక్షల కంచెలు దాటుకుని వేలాదిగా రోడ్ల మీదకు వస్తున్నారు.
శనివారం పెందుర్తి నియోజకవర్గం, సుజాత నగర్ లో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు శ్రీమతి కోటగిరి వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జనసేనానికి జనం ప్రతి అడుగులో ఘన స్వాగతం పలికారు. బీచ్ రోడ్డు నుంచి పోలీసులు తీవ్ర ఆంక్షలు అమలు చేసినప్పటికీ పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. కైలాసగిరి, సింహాచలం, వేపగుంట, సుజాత నగర్ ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలికారు.
సింహాచలం, వేపగుంట, సుజాతనగర్ కూడళ్లలో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు, హల్లో ఏపీ.. బైబై వైసీపీ నినాదాలతో హోరెత్తించారు. సింహాచలం అడవివరం వద్ద ఆడపడుచులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆప్యాయంగా జామ పండ్లు తీసుకురాగా వాటిని స్వీకరించారు. తనకోసం పండ్లు తెచ్చిన ఆడపడుచులను ఆప్యాయంగా పలుకరించారు. సుజాతా నగర్ ప్రధాన రహదారి నుంచి శ్రీమతి వరలక్ష్మి ఇంటి వరకు అపార్ట్ మెంట్ల వాసులంతా పవన్ కళ్యాణ్ గారి రాక సందర్భంగా రోడ్ల మీదకు వచ్చేశారు.
పవన్ కళ్యాణ్ గారిని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్న విషయం తెలుసుకున్న విశాఖ వాసులు ఆయనకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు వచ్చారు. ప్లకార్డుల ద్వారా సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.