Shilpa Shetty: రోజుకు రూ.3 కోట్లు.. శిల్పాశెట్టి రెస్టరంట్ అంటే మూమూలు విషయం కాదు
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి చెందిన అత్యంత ఖరీదైన, హై-ఎండ్ రెస్టారెంట్లలో ఒకటైన ‘బాస్టియన్’ గురించి తాజాగా రచయిత్రి, కాలమిస్ట్ శోభా డే సంచలన విషయాలను వెల్లడించారు. ఈ రెస్టారెంట్ ఆర్ధిక లావాదేవీలు, దాని భారీతనం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ముంబై వ్యాపార వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మోజో స్టోరీతో జరిపిన ఇంటర్వ్యూలో శోభా డే మాట్లాడుతూ, ముంబైలోని కొన్ని వ్యాపారాల సంఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేస్తాయని తెలిపారు. “ఈ నగరంలో ఒక రెస్టారెంట్ రాత్రికి రాత్రి రూ. 2 నుంచి రూ. 3 కోట్ల టర్నోవర్ చేస్తుందని విన్నాను. సాధారణ రోజుల్లో ఇది రూ. 2 కోట్లు, వారాంతంలో రూ. 3 కోట్ల ఆదాయం వరకు ఉంటుందని నమ్మశక్యంగా లేకపోయినా, ఈ నంబర్‌లను నేరుగా విన్నాను” అని ఆమె వెల్లడించారు.
ఆ రెస్టారెంట్ మరేదో కాదు, శిల్పాశెట్టికి చెందిన ‘బాస్టియన్’ అని శోభా డే స్పష్టం చేశారు. “నేను దాని లోపలికి వెళ్లి షాక్ అయ్యాను. సుమారు 1400 మంది అతిథులు అక్కడ ఉండవచ్చు. ఒకేసారి 700 మంది భోజనం చేసే అవకాశం ఉంది. అలాంటి రెండు భారీ హాల్‌లు ఉన్నాయి. అంతమంది ఒకేసారి భోజనం చేస్తుంటే నాకు నమ్మశక్యం కాలేదు” అని ఆమె రెస్టారెంట్ పరిమాణం గురించి వివరించారు.
కాగా తాజాగా శిల్పాశెట్టి తన సోషల్ మీడియా వేదికగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ‘బాస్టియన్’ బ్రాంచ్‌ను మూసివేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే, ఇదే రెస్టారెంట్‌ను ‘బాస్టియన్ బీచ్ క్లబ్’ పేరుతో జుహు ప్రాంతంలో కొత్తగా మరింత పెద్ద స్థాయిలో తెరవనున్నట్లు ఆమె తెలిపారు. బాంద్రాలోని ఈ రెస్టారెంట్ తన ప్రయాణానికి మూలమని, ఇది ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుందని శిల్పాశెట్టి భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ వార్త ముంబై ఫుడీస్ మధ్య చర్చనీయాంశంగా మారింది.
