Siddhu Jonnalagadda: ప్రభాస్ నటనపై అర్షద్ వర్షి వివాదాస్పద వ్యాఖ్యలు.. బాలీవుడ్ నటుడికి టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ స్ట్రాంగ్ కౌంటర్
Siddhu Jonnalagadda: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన గ్లోబల్ స్టార్ నటుడు ప్రభాస్ స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ నటనపై బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని సృష్టించాయి.
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ప్రభాస్‌ను చూసినప్పుడు తనకు బాధగా అనిపించిందని, అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ముందు ప్రభాస్ ఒక జోకర్లా కనిపించాడని అర్షద్ వర్షి కామెంట్ చేశారు. అంతేకాక, “ప్రభాస్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తారు?” అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దారితీశాయి. ప్రభాస్ అభిమానులు, సినీ విమర్శకులు అర్షద్ వర్షి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ వివాదం సద్దుమణగక ముందే, తాజాగా టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. అర్షద్ వర్షి వ్యాఖ్యలు “కారణాల కంటే భావోద్వేగం నుండే వచ్చి ఉంటాయని” సిద్దు అభిప్రాయపడ్డారు.
ఒక ఇంటర్వ్యూలో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, “నేను దాన్ని (అర్షద్ వర్షి వ్యాఖ్యలను) ఒక భావోద్వేగ ప్రతిచర్యగా భావిస్తున్నాను. కానీ నిజంగా చెప్పాలంటే ఆ కామెంట్స్ నాకు నచ్చలేదు. ప్రభాస్ అన్న మన తెలుగు పరిశ్రమలో అత్యంత పెద్ద స్టార్లలో ఒకరు. నిజమైన డార్లింగ్. ఈ కామెంట్స్ గురించి విన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా, బాధగా అనిపించింది. అందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది” అని సిద్దు జొన్నలగడ్డ వివరించారు.
ప్రభాస్‌కు మద్దతుగా, అదే సమయంలో ఎవరినీ నొప్పింపకుండా సిద్దు జొన్నలగడ్డ ఇచ్చిన సున్నితమైన, నిజాయితీతో కూడిన ప్రతిస్పందనను అభిమానులు మరియు నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసించారు. తమ అభిమాన నటుడిపై వచ్చిన విమర్శలకు సిద్దు ఇచ్చిన స్పష్టమైన సమాధానం సోషల్ మీడియాలో ఎందరి హృదయాలనో గెలుచుకుంది.
