Music Director Raj : ఆ సంగీత ద్వయం ఓ సంచలనం. 1980, 90 దశకాల్లో ఈ జంట మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసింది. ఏ సినిమా టైటిల్ కార్డ్ చూసినా ఈ ద్వయం పేరే. వందలాది హిట్ సాంగ్స్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఈ ద్వయంలో ఒకరైన రాజ్ ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కూకట్‌పల్లిలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పాటలంటే ఆనాటినుంచి నేటి వరకు కుర్రకారుకి చెప్పలేని మోజు. మ్యూజిక్ అని వస్తే చాలు ఆ సాంగ్స్ వినేయ్యల్సిందే. అలా ఓ దశాబ్దం పాటు కుర్రకారును హోరెత్తించిన సంగీత ద్వయం రాజ్ కోటి.
అ మూజ్యిక్ వినాలంటే కొంగ జపం చెయ్యాల్సిందే, యముడికి మొగుడులో వానజల్లు గిల్లుతుంటే, కన్నె పెట్టరో కన్ను కొట్టారో, స్వాతిలో ముత్యమంత, గజ్జ ఘల్లు మన్నదో, మేఘమా మరువకే, నీతో సాయంత్రం ఎంతో సంతోషం ఇలాంటి ఎవర్ గ్రీన్ పాటలెన్నో రాజ్ కోటి బాణీలే. ముఖ్యంగా ముఠామేస్త్రీలో ఎంత ఘాటు ప్రేమయో పాటకు వాడిన వాయిద్యాలు చూసి అందరూ కంగుతిన్నారు. హలో బ్రదర్ మూవీ సాంగ్స్ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా నంది అవార్డు కొట్టారు. గాడ్ ఫాథర్ మూవీ వీరి కాంబోలో వచ్చిన చివరి సినిమా.
అసలు ఎవరు ఈ రాజ్ కోటి :
అలనాటి సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు అబ్బాయి కోటేశ్వరరావు అలియాస్ కోటి. ఇంకో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ టివి రాజు కొడుకు సోమరాజు అలియాస్ రాజ్. రాజ్ – కోటి ఇద్దరూ అప్పటి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్స్ గా చేసేవారు. ఇక 1984లో ప్రళయ గర్జన మూవీకి రాజ్ కోటి సంగీతం అందించే ఛాన్స్ వచ్చింది. నిజానికి రాజ్ కి ఛాన్స్ వస్తే, ఇద్దరం కల్సి చేద్దామని ఒప్పించి మరీ ఇద్దరూ చేసారు.
రాజ్ కోటి మ్యూజిక్ మేనియా :
హాలీవుడ్ సంగీతం తెలుగులో ఇవ్వాలని వీరికి ఉండేది. మదన గోపాలుడు, సాహసం చేయరా డింభకా, చిక్కడు దొరకడు లాంటి మూవీస్ గుర్తింపు తెచ్చాయి. ఇక 1988లో తొలిసారి సుప్రీం హీరో చిరంజీవితో చేసే ఛాన్స్ దక్కడంతో యముడికి మొగుడు మూవీలో రాజ్ కోటి తమ విశ్వరూపం చూపించారు. అందం హిందోళం, వానజల్లు గిల్లుతుంటే, వంటి పాటలు బంపర్ హిట్స్ అయ్యాయి. ఇక సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
ఇక బజారు రౌడీ, లంకేశ్వరుడు, పల్నాటి రుద్రయ్య , బాలగోపాలుడు, విక్కీ దాదా, కొడుకు దిద్దిన కాపురం, టు టౌన్ రౌడీ ఇలా వరుస హిట్స్ తో రెండేళ్లలోనే టాప్ ప్లేస్ కి వచ్చేసారు. ఇళయరాజా కూడా బీటౌట్ చేశారా అనే దశకు చేరారు. ఇక కొదమ సింహం మూవీతో రాజ్ కోటి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. చిరంజీవి సినిమాలకు రాజ్ కోటి సంగీతంతో చెలరేగిపోయి ఇండస్ట్రీని ఏలారు. ముఠామేస్త్రి, మెకానిక్ అల్లుడు, దొంగ అల్లుడు, బావ బావమరిది, హలో బ్రదర్, నిప్పురవ్వ, సీతారత్నం గారబ్బాయి, ఇలా ఎన్నో హిట్స్ అందించారు.
వ్యక్తిగత కారణాల వల్ల 1995లో కోటి నుంచి రాజ్ విడిపోయారు. కోటి నుంచి విడిపోయిన తరవాత ‘సిసింద్రీ’ సినిమాకు రాజ్ సంగీతం అందించారు. ఆ తరవాత ‘భరతసింహం’, ‘రాముడొచ్చాడు’, మృగం, బొబ్బిలి బుల్లోడు, సంభవం, చిన్నిచిన్ని ఆశ, లగ్న పత్రిక వంటి సినిమాలకు సంగీతం సమకూర్చారు. వెంకటేష్, ప్రీతీజింట నటించిన ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాకు రమణ గోగుల పాటలు స్వరపరిస్తే.. రాజ్ నేపథ్య సంగీతం అందించారు. 2002లో వచ్చిన ‘లగ్నపత్రిక’ రాజ్ ఆఖరి చిత్రం.