నాయకులతో సంబంధం లేకుండా కార్యకర్తలే ముందుకు నడిపిస్తున్న పార్టీ జనసేన పార్టీ. దేశంలో ఇంకా ఏ పార్టీకి కూడా ఇలాంటి కార్యకర్తలు ఉండరేమో. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ పార్టీ ఉనికిని చాటుతూ ఉంటారు. సేవా కార్యక్రమాల్లో గానీ, సమస్యలపై స్పందించడం లో గానీ ఎప్పుడూ ముందుంటారు. తమ నాయకుడిపై వచ్చే విమర్శలకు సమాధానం ఇవ్వడంలో గానీ, నాయకుడి ఆలోచనలు ప్రచారం చేయడంలో గానీ జనసైనికులదే మేజర్ పార్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లని జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అత్యద్భుతంగా ఉపయోగించుకుంటారు. కార్యకర్తల బలమే ఆ పార్టీకి వెన్నుముకగా నిలుస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మిగిలిన పార్టీలకు ఆర్గనైజింగ్ వ్యవస్థలు, జీతభత్యాలు, అనేక రకాల సదుపాయాలు ఉంటాయి. కానీ జనసేన కు నూటికి 99 శాతం కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా పనిచేసేవారే.
ఇదే సోషల్ మీడియా వేదికగా తమ నేత పుట్టినరోజుకి గత సంవత్సరం విరాళాల సేకరణ కు పిలుపునిచ్చారు. ఆ పిలుపు అందుకున్న కార్యకర్తలు పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చి పార్టీ నడపడానికి ఇతోధికంగా తోడ్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే కరోనా మహమ్మారి వలన అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతున్న వారికి తమ వంతు సహాయంగా ఆక్సిజన్ సిలిండర్లు, మినీ వెంటిలేటర్లు అన్ని జిల్లాల్లో అందజేస్తున్నారు.అది కాకుండా తమ అధినేత పుట్టినరోజుకి సోషల్ మీడియాలో సరికొత్త రీతిలో తమ గళాన్ని వినిపించడానికి సిద్ధమవుతున్నారు.
సోషల్ మీడియాలో Raise Your Voice on Janasenai Birthday అనే సరికొత్త కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని గెలిపించుకోకపోవడం వలన జరిగిన నష్టం గురించి, ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం గురించి గళం విప్పడానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైఫల్యాలపై వివిధ అంశాలను ఎంచుకుని వీడియో ద్వారా మాట్లాడి తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే రీతి లో తమ అధినేత పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. మరి ప్రజలు ఎంత వరకు ఆ పార్టీకి అండగా నిలుస్తారు అనేది కాలమే నిర్ణయిస్తుంది.