Director Raghavendra Rao : ప్రేక్షక దేవుళ్ళకి కళానురక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం, సమర్పించి ఆభిమానాన్ని వరంగా సంపాదించుకున్న దర్శకుడు. తనద ర్శకత్వ ప్రతిభతో ఇంద్రజాలాన్ని వెండితెరపై ఆవిష్కరించిన దర్శకేంద్రుడు. కమర్షియల్ సినిమా విజయ సూత్రానికి గరిమనాభి. సౌందర్యోపాసన చేసిన మౌనముని. పరదాపై పదహారేళ్ళ పసిడి ఆందాలని సుతిమెత్తగా అద్ది అతిలోక సుందరిని అలవోకగా రంగులప్ర పంచంలో విహరింప జేసి, సొందర్య లహరిలో సాగర కన్యను ఓలలాడించి, రోజా పువ్వులతో రమణులని రమ్యంగా రంజింపజేసిప్రే క్షకులను సైతం జగదేకవీరులు, సాహస వీరులుగా మార్చి రెట్టింపు ఉత్సాహాన్ని కలుగజేసే మంత్రగాడు. తెరపై అందాలని అరేసిప్రేక్షకుల కళ్ళు చలన చిత్రంపై పారేసుకునేటట్లు చేసి నిర్మాతలను కాసుల వర్షంలో తడిపే మీకు వందనం. కోవెలమూడి రాఘవేంద్రరావు 1942 మే 23న విజయవాడ కంకిపాడు దగ్గర కొలవెన్ను గ్రామంలో పుట్టారు.
ఆయన తండ్రి కోవెలమూడి సూర్య
ప్రకాశరావు. తల్లి కోటేశ్వరమ్మ. భార్య సరళ. కుమారుడు ప్రకాష్ కోవెలమూడి, కూతురు మాధవి. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు 1961లో ‘వాగ్దానం’ సినిమాకి అసోసియేట్ దైరక్టర్ గా పనిచేసి మెళకువలు నేర్చుకున్న
తరువాత మరికొన్ని చిత్రాల్లో కూడా పనిచేసి అనుభవం సంపాదించుకుని దర్శకుడిగా 1975లో ‘బాబు’ సినిమాతో పరిచయమై విజయయాత్రను ప్రారంభించారు. ‘జ్యోతి’, ‘ఆమె కథ’, ‘అమరదీపం’, ‘ప్రేమలేఖలు’, ‘కల్పన’లాంటి ఉత్తమాభిరుచిగల సినిమాలకు దర్శకత్వం వహించారు. అ తర్వాత కాలంలో ప్రేక్షకులకు కావల్సింది తనమదిలో వున్న దర్శక కౌశలాన్ని కలగలిపి బాక్సాఫీస్ బద్దలు
కొడుతూ కమర్షియల్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఎన్నో విజయాలు అందుకున్నారు. అగ్రశ్రేణి దర్శకుడిగా కొన్ని దశాబ్దాలు ప్రభావితం చేసారు.
ఎంతోమంది దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. అడవిరాముడు’ సినిమా రాఘవేంద్రరావు దర్శక శైలిని, పంధాని మార్చేసింది. ‘అడవిరాముడు’. ఈ చిత్రం అప్పట్లో సాధించిన విజయం అత్యద్భుతం. ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమా ఇది. జయప్రద, జయసుధ.. ఇద్దరు నాయికలు, ఆరేసుకోబోయి పారేసుకున్నాననే.. వేటూరి అల్లరల్లరి పాటలు.. ఈ చిత్రాన్ని విజయపధంలోకి నడిపించాయి. ఆ తరువాత .. ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ కి ఇమేజ్ బాగా పెరిగింది. ‘సింహబలుడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘వేటగాడు’, ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’, ‘గజదొంగ’, ‘తిరుగులేని మనిషి’, ‘సత్యం శివం’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’, ‘మేజర్ చంద్రకాంత్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించి విజయం సాధించారు.
అక్కినేని నాగేశ్వరరావుతో కూడా రాఘవేంద్రరావు అతి తక్కువగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ప్రేమకానుక’, ‘అగ్ని
పుత్రుడు’, ‘సత్యం శివం’, ‘పెళ్లి సంబంధం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చంద్రమోహన్ శ్రీదేవి జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘పదహారేళ్ళవయసు’ అద్భుత విజయాన్ని చవి చూసింది. శోభన్ బాబుతో ‘మోసగాడు’, ‘ఇద్దరు దొంగలు’, ‘దేవత’
తీశారు. ఇక, కృష్ణంరాజుతో ‘అడవి సింహాలు’, ‘అమరదీపం’, ‘త్రిశూలం’, ‘రగిలే జ్వాల’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘రావణ బ్రహ్మ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కృష్ణ కి కూడా కొన్ని విజయవంతమైన చిత్రాలు అందించారు. ‘భలే కృష్ణుడు’, ‘ఘరానా దొంగ’,
‘ఊరికి మొనగాడు’, ‘శక్తి’, ‘అగ్నిపర్వతం’, ‘వజ్రాయుధం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
చిరంజీవితో కమర్షియల్ హిట్స్ అందించారు. ‘అడవిదొంగ’, ‘కొండవీటి రాజా’, ‘చాణక్య శపధం’, ‘యుద్దభూమి’, ‘రుద్రనేత్ర’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ఇద్దరు మిత్రులు’, ‘శ్రీ మంజునాథ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జునతో తీసిన చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ‘ ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’, ‘షిర్డీ సాయి’, ‘ఓం నమో వెంకటేశాయా’ చిత్రాలు తీశారు. భక్తి ప్రధానమైన చిత్రాల్ల్లో ‘అన్నమయ్య’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘షిర్డీ సాయి’ చిత్రాలు మంచి ఆదరణకు నోచుకున్నాయి. బాలకృష్ణ, మోహన్ బాబు, రాజశేఖర్, జెడి చక్రవర్తి.. ఇలా ఎంతోమంది హీరోలతో ఆయన చిత్రాలు తీసి హిట్ చేశారు.
అల్లు అర్జున్ మొదటి సినిమా రాఘవేంద్రరావు వందో సినిమా ‘గంగోత్రి’, మహేష్ బాబు మొదటి సినిమా ‘రాకుమారుడు’.. ఇలా ఈతరం నటులతో కూడా ఆయన సినిమాలు తీశారు. నితిన్, త్రిష జంటగా ‘అల్లరిబుల్లోడు’ సినిమా కూడా హిట్ అయింది. మంచు మనోజ్ తో ‘ఝుమ్మంది నాదం’ సినిమా తీశారు.
ఫిలిం ఫేర్ సౌత్ పురస్కారాలు: 1977లో
‘ప్రేమలేఖలు’, 1990లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, 1993లో ‘అల్లరి ప్రియుడు’, 1997లో ‘అన్నమయ్య’, చిత్రాలకుగాను ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులు రాఘవేంద్రరావుని వరించి వచ్చాయి. 2002లో ఫిలిం ఫేర్ సౌత్ జీవన సాఫల్య
పురస్కారంతో సత్కరించింది.
నంది అవార్డులు: 1984లో ‘బొబ్బిలి బ్రహ్మన్న’, 1993లో ‘అల్లరి ప్రియుడు’, 1996లో ‘పెళ్లి
సందడి’, 1997లో ‘అన్నమయ్య’ చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులను అందుకున్నారు. ప్రత్యేకించి
అన్నమయ్య చిత్రానికి అదనంగా ఉత్తమ చిత్రంగా మరో నంది కూడా వచ్చింది. 2009లో తెలుగు సినిమాకు అందించిన సృజనకుగాను బి.ఎన్.రెడ్డి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
2015లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని రాఘవేంద్రరావు అందుకున్నారు. 2017లో అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్తో ఇండియన్ సినిమా పురస్కారాన్ని ఐఐఎఫ్ఎ సంస్థ అందించింది. 2014లో సైమా జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. 2012లో జీవన సాఫల్య పురస్కారాన్ని సినిమా అవార్డులు అందించింది. 2013లో ‘షిరిడీ సాయి’ సినిమాకిగాను సినిమా అవార్డు స్పెషల్ జ్యూరీ పురస్కారం అందింది. 2016లో అల్లురామలింగయ్య అవార్డును రాఘవేంద్రరావు అందుకున్నారు. అసౌందర్య దీప్తులు అ సంగీత రవళి శ్రీకాంతుడు పంచిన బ్రహ్మానందం. కాఫీలు తాగారా టిఫినీలు చేస్తారా అని అప్యాయంగా పలకరించి తెలుగు దేశాన పెళ్ళి సందడి చేసింది.
అల్లుడూగారు అల్లరిమెగుడు సమ్మోహన అస్త్రాలై ప్రేక్షకుల మదిని తాకినాయి. ఆయన అలోచన ఆందాల అగ్నిపర్వతం. అంకితభావం దృఢ సంకల్పం ఆయనకు వజ్రాయుద్దం అందుకే రాఘవేంద్రరావు గారి చిత్రాలు అన్ని జయప్రదమైన చిత్రాల సరసన నిలిచాయి. ఆయన సినిమాలు రమణీయ దృశ్య కావ్యాలు. రాఘవేంద్రరావు బి.ఎ (భా) అంటే బోలెడన్ని అందాలు, అద్భుతాలకు, నెలవని సగటు ప్రేక్షకునికి దృఢమైన నమ్మకం. తన చిత్రాలను సౌందర్యాభినందన లేఖలుగా మార్చి చిత్ర లోకానికి పంచిన దర్శక విపంచి, ఆ విరించి మీమ్మల్ని దీర్ఘాయువుగా దీవించాలి. దర్శకేంద్రునికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు..