Interesting Facts about Vemana Indlu Village : కాళ్లకు చెప్పుల్లేకుండా ఉండే వాళ్ళని ఎప్పుడైనా చూసారా! ఒకరు కాదు,ఇద్దరు కాదు ఏకంగా ఊరు ,ఊరు మొత్తం చెప్పులు లేకుండా బ్రతుకుతున్నారు. అవును మీరు వినేది నిజమే ఆశ్చర్యం కల్పించే ఆ గ్రామం, ఆ ప్రజలు ఎక్కడ ఉన్నారో తెలుసుకుందాం. ఆ గ్రామం మరెక్కడో కాదు మన భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ గ్రామం పేరు “వేమన ఇండ్లు”. ఇలాంటి ఒక గ్రామం ఉందని చాలామందికి తెలియకపోవచ్చు.
ఇది తిరుపతికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో అతి తక్కువ సంఖ్యలో 25 కుటుంబాలు మాత్రమే నివసిస్తాయి. వేమన ఇండ్లు గ్రామంలో మొత్తం జనాభా 80 మంది మాత్రమే, వీరు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వీరందరూ నిరక్షరాస్యులు. అంత తక్కువ జనాభా ఉన్న గ్రామానికి ప్రత్యేకతలు,
సాంప్రదాయాలు మాత్రం ఎక్కువనే. ఈ గ్రామం వాళ్లు చెప్పులు ధరించకపోవడమే కాకుండా, ఏదైనా జబ్బు చేస్తే ఆసుపత్రికి కూడా వెళ్లరు. పక్క గ్రామం నుంచి ఎవరైనా ఈ గ్రామానికి వస్తే వారికి కూడా ఈ నియమ, నిబంధనలే వర్తిస్తాయి. పాల్వేకారి వర్గం వారు ఈ గ్రామంలో నివసిస్తున్నారు. తమను తాము దొరవర్లుగా ప్రకటించుకుంటారు.కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ కులాన్ని వెనుకబడిన తరగతిలోనే గుర్తిస్తారు.
ఈ గ్రామస్తులు తమ గ్రామాన్ని దేవాలయంగా తమ గ్రామంలో ఉన్న దేవాలయంలోని దేవుణ్ణి మాత్రమే తమ దేవుడికి భావిస్తారు. తిరుపతి వెంకటేశ్వర ఆలయం దగ్గరగా ఉన్నా కూడా వీరు అక్కడికి వెళ్లి పూజించరు. వీరి గ్రామంలో మాత్రమే పూజలు నిర్వహిస్తారు. అలాగే గుడి దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర వీరికి ఏమైనా అస్వస్థత కలిగితే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తారు తప్ప, ఆస్పత్రికి మాత్రం వెళ్లరు.
ఈ కఠిన నియమాలు పక్క ఊరి నుంచి వచ్చే వారికి కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి. ఉన్నతాధికారులు సైతం ఈ నియమాలను పాటించాల్సిందే. ఊరి పొలిమేరలోకి రాగానే ఖచ్చితంగా చెప్పులు విప్పి ,స్నానం చేసుకున్న తర్వాతనే ఊరి లోపలికి వెళ్ళాలి. ఆడవారు పిరియడ్స్ గా ఉన్న సమయం అయితే వారిని ఊరి బయట ఉంచుతారు. వారికి అన్ని వస్తువులు అక్కడికే పంపిస్తారు.