Tholi Prema Re Release : వర్షం భూమ్మీద ఎక్కడైనా పడొచ్చు. కానీ సరైన చోటులో పడితేనే ఆ వాన చినుకులకు విలువ వస్తుంది. తొలి ప్రేమ కథ అనేది కళ్యాణ్ గారి చేతిలో పడింది. అందువల్లే అంత పెద్ద హిట్ అయింది. తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైమ్ టాప్ 10 ప్రేమకథా చిత్రాల గురించి మాట్లాడుకుంటే.. అందులో ఖచ్చితంగా చోటు దక్కించుకునే సినిమా తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ సినీ గమనాన్ని మార్చేసిన సినిమా ఇది. సంచలన విజయంతో పాటు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం సంపాదించింది ఈ చిత్రం. తొలి ప్రేమ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి రిస్క్ చేసి మరీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
యువతకి పవన్‌ని బాగా దగ్గర చేసిన సినిమా ఇది. క్లాసిక్ లవ్ స్టోరీల్లో తొలి ప్రేమకు ఉన్న స్థానం వేరు. ఈ సినిమా వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా ఈనెల 30న రీ రీలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే వెండి తెరపై, హోం స్క్రీన్స్ లో, టీవీల్లో ఈ సినిమాని చాలాసార్లు చూసేశారు. అయినా ఈ సినిమాకి ఉన్న ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదు. ఈ నెల 30న రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ హిట్ గా నిలిచిన ప్రేమ కథా చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు.
ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ చిత్రం 1998 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది. ఓ మధ్య తరగతి యువకుడి తొలిప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను కట్టిపడేసింది. ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, దేవా స్వరపరిచిన పాటలు ఈ సినిమాని మళ్ళీమళ్ళీ చూసేలా చేశాయి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అతికొద్ది సినిమాల్లో ఒకటిగా ‘తొలిప్రేమ’ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ వెండితెర మీద చూసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. ‘తొలిప్రేమ’ విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4k నూతన సాంకేతికతను జోడించి విడుదల చేస్తున్నారు.
‘తొలి ప్రేమ’లో తన విలక్షణమైన మ్యానరిజమ్స్‌తో పాటు సిన్సియర్ లవర్‌గా అతని పాత్ర అతని అభిమానులపై శాశ్వత ముద్ర వేసింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అతడి సరసన కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించింది. వాసుకి, పవన్ కు చెల్లెలిగా కనిపించింది. వాసుకి భర్త ఆనంద్ సాయి ఈ సినిమాకు ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేశాడు. ఈ సినిమా కోసం అతడు వేసిన తాజ్ మహల్ సెట్ అందరి ప్రశంసలు అందుకుంది.. ‘తొలిప్రేమ’ కోసం దేవా స్వరపరిచిన సంగీతం ఆ కాలంలోని సంగీత ప్రియులను ఆకట్టుకునే పాటలతో విస్తృత ప్రశంసలు అందుకుంది.
పారితోషకంతో పుస్తకాలు మొబైల్ కొనుకొన్నాడట పవన్ :
పాతికేళ్ల క్రితం ఈ సినిమా కోసం పవన్‌కి ఇచ్చిన రెమ్యునరేషన్ చాలా తక్కువ. అప్పట్లో నిర్మాత పవన్‌కి పారితోషికం ఇవ్వలేదు. నెల నెల జీతంగా కొంత మొత్తం ఇచ్చారు. సినిమా రిలీజైన రెండో రోజు పారితోషికంగా కొంత మొత్తం అప్పగిస్తే ఆ డబ్బులతో పుస్తకాలు, మొబైల్ కొనుకొన్నాడట పవన్. ఈ విషయాన్ని తొలిప్రేమ నిర్మాత స్వయంగా వెల్లడించారు
రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది :
టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు సంబంధించిన సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కోవలో మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలి ప్రేమ’ రీ రిలీజ్‌కి సిద్ధమైంది. జూన్ 30న ఈ చిత్రం మరోసారి థియేటర్స్‌లో సందడి చేయటానికి సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో తొలిప్రేమ చిత్రాన్ని జి.వి.జి.రాజు నిర్మించారు. జూలై 30, 2024 నాటికి ఈ సినిమా రిలీజై పాతికేళ్లు పూర్తయ్యాయి. మరింత ఉత్తేజకరమైన విషయం ఏమిటంటే, ‘తొలి ప్రేమ’ 4K టెక్నాలజీలో ప్రదర్శించబడుతుంది. ఇది ప్రేక్షకులకు మెరుగైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.
ఈ సినిమా 24 ఏళ్ల కింద వసూలు చేసిన కలెక్షన్స్ ఎంతో చూద్దాం..
నైజాం: 2.97 కోట్లు, సీడెడ్: 1.52 కోట్లు, ఉత్తరాంధ్ర: 1.04 కోట్లు, ఈస్ట్: 0.66 కోట్లు, వెస్ట్: 0.51 కోట్లు, గుంటూరు: 0.69 కోట్లు, కృష్ణా: 0.53 కోట్లు, నెల్లూరు: 0.36 కోట్లు, ఏపీ + తెలంగాణ: 8.28 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.32 కోట్లు, వరల్డ్ వైడ్: 8.60 కోట్లు.
జనసేన రైతు భరోసా యాత్రకు విరాళంగా ‘తొలిప్రేమ’ కలెక్షన్లు..
‘తొలిప్రేమ’ రీ రిలీజ్ వేడుకలో శ్రీ మాతా క్రియేషన్స్ నిర్మాతలు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ “మేం పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా సినిమాను రీ రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాం. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ‘తొలి ప్రేమ’ నిర్మాత జి.వి.జి. రాజు గారికి థాంక్స్. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొత్త మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తలపెట్టిన రైతు భరోసా యాత్రకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” అని చెప్పారు.
‘ఈ సినిమా చేయడం నా అదృష్టం. ‘తొలిప్రేమ’ నా జీవితాన్నే మార్చేసింది.
తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ “నా కథ అనేది పవన్ కళ్యాణ్ గారి చేతిలో పడటం వల్లే ఇంత పెద్ద హిట్ అయింది. అన్నయ్యతో పాటు నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత జి.వి.జి. రాజు గారికి థాంక్స్. ఈ సినిమా చేయడం నా అదృష్టం. ‘తొలిప్రేమ’ నా జీవితాన్నే మార్చేసింది. ‘నా అమ్మానాన్న.. పవన్ కళ్యాణ్’ అని నేను ఎక్కడికి వెళ్ళినా చెబుతుంటాను. ఎప్పటికీ అన్నయ్యకు కృతజ్ఞుడిగా ఉంటాను” అని చెప్పారు.
ఒక్క సిట్టింగులో కొనేశా : ‘దిల్’ రాజు
పంపిణీదారుడు చిత్రసీమలో ప్రయాణం ప్రారంభించిన ‘దిల్’ రాజుకు.. అభిమాన హీరోతో సినిమా నిర్మించడానికి కొన్నేళ్ళు పట్టింది. పంపిణీదారుడిగా చిత్రసీమలో ఆయనకు బలమైన పునాది వేసిన చిత్రమిది. సినిమా తనకు ఎంత మేలు చేసిందీ ‘దిల్’ రాజు వివరించారు. సినిమా తనకు ఎంత మేలు చేసిందీ ‘దిల్’ రాజు వివరించారు. ”తొలిప్రేమ’లో భాగమైన హీరో పవన్ కళ్యాణ్ గారికి, దర్శకుడు కరుణాకరన్ గారికి, నిర్మాత జీవీజీ రాజు గారికి అందరికీ ఈ సినిమా ఒక మరిచిపోలేని జ్ఞాపకం. నా సినీ ప్రయాణంలో ఈ చిత్రానికి ఒక ప్రత్యేక పేజీ ఉంటుంది. పంపిణీదారుడిగా తెలుగు చిత్రసీమలో అప్పుడప్పుడే నా ప్రయాణం మొదలైంది. రవీందర్ రెడ్డి అని ఓ ఫైనాన్సియర్ ఉన్నారు.
ఓసారి నాతో మాట్లాడుతూ ‘జీవీజీ రాజు గారి నిర్మాణంలో కొత్త దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నారు’ అని చెప్పారు. అప్పటికి నాకు తెలిసిన సమాచారం అంతే! నేను కొన్ని లెక్కలేసుకొని ‘తొలిప్రేమ’ ముహూర్త కార్యక్రమాలకు వెళ్ళాను. అప్పటికి నా గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. ఒక్క ‘పెళ్లి పందిరి’ సినిమా మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేశా. జీవీజీ రాజు గారిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. డిస్ట్రిబ్యూషన్ ఇవ్వమని నేరుగా అడిగా. పూజా కార్యక్రమాలు అయిపోయాక ఒకసారి కలవమన్నారు. ఆఫీసుకు వెళ్లి కలిశాను. ఒక్క సిట్టింగులోనే సినిమా కొనేశా. అప్పటి నుంచి ఈ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. నేను నిర్మాతగా ఎన్ని అద్భుతమైన సినిమాలు తీసినా.. నా మనసులో ఎప్పటికీ ‘తొలిప్రేమ’కి ప్రత్యేక స్థానం ఉంటుంది” అని చెప్పారు.
డబ్బులు అవసరమైన ప్రతిసారీ రీ రిలీజ్ చేశా..
తొలిప్రేమ వంద రోజుల వేడుక జరిగిన రోజు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. అయినా సరే కంట్రోల్ చేయలేనంతగా అభిమానులు, ప్రేక్షకులు వచ్చారు. అది ఒక చరిత్ర. అటువంటి ఫంక్షన్ నేను మళ్ళీ చూడలేదు. ఎన్నో చరిత్రలు సృష్టించిన సినిమా తొలిప్రేమ. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఐదేళ్లకు ఇచ్చేవాళ్ళు. నా దగ్గర డబ్బులు ఎప్పుడు తక్కువ ఉన్నా… ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ చేసేవాణ్ణి. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే.. ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవడం కోసం మళ్ళీ ‘తొలిప్రేమ’ను రీ రిలీజ్ చేసేవాణ్ణి.
మూడుసార్లు రీ రిలీజ్ చేశాం. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే.. నాకు అడుగులు నేర్పించిన సినిమా ‘తొలిప్రేమ’. రీ రిలీజ్ ట్రైలర్ చూస్తుంటే.. మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ మరోసారి థియేటర్లకు మంచి అనుభూతి పొందండి. ఈ సినిమా విడుదల చేస్తున్న రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డికి ఆల్ ది బెస్ట్” అని అన్నారు. అదీ సంగతి! 1998 ఏడాదికిగాను బెస్ట్ తెలుగు మూవీగా తొలి ప్రేమ నేషనల్ అవార్డును అందుకున్నది. ఆరు నంది అవార్డులను దక్కించుకొంది.