Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో చేదు గుర్తులను మిగిల్చి వెళ్లిపోయింది. ఎంతోమంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. చాలామంది ఆత్మీయులను కోల్పోయారు. కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. అనుకోని సంఘటన అనేక హృదయాలపై మాయని మచ్చగా మిగిలిపోయింది.
ఒక్కొ శిధిలాన్నీ తొలగిస్తూ ఉంటే వాటి కింద ఉన్న శవాలు చూస్తున్నవారికి కంటనీరు ఆగదు. ఊహించని ఈ సంఘటన కళ్ళ ముందు చెదిరిపోవడానికి చాలా కాలమే పడుతుంది. హృదయ విధారకంగా పడి ఉన్న గుట్ట లాంటి శవాలను చూస్తుంటే ఒక్కొక్కరి ఆశలు ఆ రైలు పట్టాల మీద అవిరైపోయాయి కదా అనిపించేలా మనసు చివుక్కు మంటుంది.
అందరూ ఇంటికి చేరుతామని ఆశతో, వెయ్యి ఆలోచనలతో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారేమో.. కానీ వారి కలలన్నీ మిగిలిన వారికి కన్నీటిని మిగిల్చాయి. ఆ భోగిల శిథిలాలను తీస్తున్న వేళ లేత హృదయాలలో చిగురించిన ప్రేమ కవిత్వాలు దర్శనమిచ్చాయి. ఆ రైలు పట్టాలపై నిర్జీవమైన ప్రేమ అక్షరాలు చిరిగిన డైరీ పేజీల్లో కనిపిస్తూ ఉంటే…
చిగురించిన ప్రేమ ఇలా అకస్మాత్తుగా రైలుపట్టాల మధ్యలో సమాధి అయిపోయిందే అని చూపరులకు కన్నీళ్లు ఆగడం లేదు. ఒక ప్యాసింజర్ తన మనసులోని భావాలన్నీ డైరీలో పొందుపరచుకున్నాడు. ప్రేమ కావ్యాలను, కల్మషం లేని తన మనసుని బొమ్మల రూపంలో అక్షరాలుగా మార్చి ప్రేమను ఆ డైరీలో విరబూసేలా చేశాడు. కానీ ఆ ప్రేమ ఊహించని విధంగా ముక్కలైపోయింది.
భోగిలను తీస్తూ ఉన్న సమయంలో రైలు పట్టాలపై ఆ నిర్జీవ అక్షరాల ప్రేమ కాగితాలు కనిపించాయి. బెంగాలీ భాషలో ఉన్నాయి ఆ ప్రేమ కవిత్వాలు. ‘చెదురుమదురుగా కనిపించే మేఘాలు సన్నటి వర్షాన్ని కురిపిస్తాయి. మనం వినే చిట్టి కథలే మనలో ప్రేమను వికసింపజేస్తాయి’ అని అందులో రాసిన కవిత సారాంశం. ‘ప్రేమవై నీవు నాకు ఎల్లప్పుడూ కావాలి, నా మనసులో నీవెప్పుడూ ఉంటావు’ అంటూ మరో కవిత ఉన్నది.
ఒకవైపు విరిగిన కాళ్లు చేతుల ఆర్తనాదాలు, మరోవైపు శవాల గుట్టలు, వాటి నడుమ ఈ ప్రేమాఅక్షరాలు తలుచుకుంటేనే హృదయం తడైపోతుంది.