Rain of Fish : నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన దగ్గర్నుంచి వర్షాలు అంత ఆశాజనకంగా లేవని అందరూ ఆందోళన చెందుతున్న క్రమంలో, ఒకసారిగా వర్షం అలుముకొని మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇదంతా బానే ఉంది కానీ.. ఒకచోట మాత్రం చేపల వర్షం కురుస్తూ ఆ గ్రామ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. ఇదేంటి చేపల వర్షం కురవడం ఏంటి అనుకుంటున్నారా.. అవును అది వాస్తవం. ఆ గ్రామంలో చేపల వర్షం కురుస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ.. చేపల వర్షం నిజంగానే కురుస్తుందా.. ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకోనేరు గ్రామంలో ఈ వింత జరుగుతుంది. ఆ గ్రామంలో చేపల వర్షం కురుస్తూ ఆ గ్రామ ప్రజల్ని అయోమయంలో నెట్టివేసింది. రెండు రోజుల నుంచి ఏపీ మొత్తం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అస్తవ్యస్తం అవుతుంటే, ఇప్పుడు అక్కడ చేపల వర్షం పడి అందర్నీ ఇంకా ఆశ్చర్యానికి గురిచేసింది. చాలామంది చేపల వర్షం గురించి ఇంతకుముందు విన్నాం కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నామని చెప్తున్నారు. ఇంకొందరు ఆ చేపల వర్షాన్ని ఫోన్లో రికార్డ్ చేసుకుని నెట్ ఇంట్లో వైరల్ చేస్తున్నారు.
వాస్తవానికి చేపల వర్షం ఉంటుందా? ఈ చేపలు ఆకాశం నుంచే పడుతున్నాయా ? తెలుసుకుందాం. ఈ చేపల వర్షం గురించి రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. నదులు, సముద్రాల్లో సుడిగుండాలు ఏర్పడడం అవి ఆకాశానికి చేరువయ్యేలోపే ఆవిరయ్యే సమయంలో ఆ సుడిగుండాలతో చేపలు కూడా పైకి వెళ్లడం తర్వాత వర్షం రూపంలో చేపలు కూడా కిందికి కురవడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు సముద్రంలో కొన్ని ప్రకంపనలు జరుగుతాయని కూడా నిపుణులు చెప్తున్నారు.
అయితే ఇంకో అభిప్రాయం ప్రకారము మెరుపులు, విపరీతమైన గాలులు వచ్చినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి చేపల గుడ్లు, చిన్న చిన్న కప్పలగుడ్లు ఆవిరి ద్వారా మేఘాల్లోకి వెళ్లిపోతాయి. అలా వెళ్ళిన చేపలు ఆ మేఘాలు వర్షంలా కురిసినప్పుడు ఆ నీటితో పాటు కిందకు పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వర్షాకాల ప్రారంభంలో చెరువులు, కుంటల్లో ప్రెజర్ ఏరియా ఏర్పడుతుందని, ఆ సమయంలో యాంఫీబియస్ నేచర్ ఉన్న నల్లటి చేపలు గాల్లోకి ఎగురుతాయని నిపుణులు అంటున్నారు. అలా వెళ్లిన చేపలు వర్షం, గాలి వచ్చినప్పుడు గాల్లోకి ఎగిరి మళ్లీ వర్షంతో పాటు కిందకు పడతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.