Bhongir Hill Fort : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏకశిల కోట.. అభివృద్ధి కి నోచుకోని అలనాటి కాకతీయుల కళా వైభవం..!!
భువనగిరి ఖిల్లా..తెలంగాణ రాష్ట్ర చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ కోట ఎన్నో పోరాటాలకు నెలవైంది. దాదాపు 3000 సంవత్సరాల నాటి ఈ అద్భుతమైన కోట అనేక ఆశ్చర్యపరిచే నిర్మాణాలకు నిలయం. 610 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ తెలంగాణలోనే ఎత్తైన పర్వతం. ఆసియా ఖండం లోనే అత్యంత పెద్దదైన శిలగా పేరైతే ఉందికానీ, ప్రభుత్వం నుండి గుర్తింపు ఆదరణ లేదు.. గతంలో కాకతీయులు పైన కోట ని నిర్మించి తమ పరిపాలన వేదికగా నిర్మించుకున్న ఈ కోట నేడు నిరాదరణకు గురి అవుతుంది .
ధీర వనిత రాణి రుద్రమదేవి కూడా ఇక్కడినుండే పరిపాలించినట్టు చారిత్రక ఆనవాళ్ళు తెలిపే శిలా శాసనాలు కూడా ఉన్నాయ్. ఆ తరువాత కాలంలో తెలంగాణా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఇక్కడినుండే తన పాలనని, అలాగే శత్రువులని తన దగ్గరికి రాకుండా గుట్ట చుట్టూ పెద్ద పెద్ద ప్రహారీలు కట్టించాడు. శత్రువులు కూడా దాడి చేయడానికి వీల్లెనంత ఎత్తులో ఉండడం వల్ల ఈ గుట్టని రాజులు తమ ప్రధాన స్థావరంగా చేసుకొని పాలన కొనసాగించారు..
ఇలా ఎంతో ప్రాముఖ్యత గల గుట్ట నేడు అభివృద్ధికి నోచుకోక అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారడం చాలా బాధాకరం. రాజధాని హైదరాబాద్ కి కూతవేటు దూరంలో.. తెలంగాణా తిరుపతిగా పేరు గడించిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి అత్యంత దగ్గరగా ఉన్న భువనగిరి పట్టణంలో ఉన్న ఈ ఏకశిలని పర్యాటక ప్రాంతంగా చేయాలని, ఎన్నో ఏళ్ల నుండి స్థానికులు కోరుతున్నారు. ఇందుకు ప్రభుత్వంకూడా సరేనని త్వరలోనే పర్యాటక ప్రాంతంతో పాటు రాక్ క్లయింబింగ్ శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని , అలాగే రోప్ వే కూడా నిర్మిస్తాం అని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి అని చెప్పి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా ఒక్క రూపాయి కూడా విదల్చలేదు ..
గతంలో ఎవరెస్టు ఎక్కి దేశ ప్రతిష్ట ని ఇనుమడింపజేసి రికార్డ్ సృష్టించిన గిరిజన అమ్మాయి మాలావత్ పూర్ణ తన రాక్ క్లయింబింగ్ శిక్షణ తీసుకుంది ఇక్కడే కావడం విశేషం. అంతేకాకుండా యాదాద్రి కి నిత్యం రాష్ట్రం నలుమూలల వచ్చే భక్తులు తిరుగుప్రయాణంలో ఎంతో విశిష్టత కలిగిన భువనగిరి కి కూడా వస్తారని, అలాగే ట్రెక్కింగ్ కోసమని, పైన ఉన్న కోటని చూడడానికి చాలామంది వస్తారని, ఇక ప్రతీ ఆదివారం వచ్చే సందర్శకులతో నిత్యం రద్దీ గా ఉంటుందని , దీనితో కనీస అవసరాలు కల్పిస్తే బాగుంటుందనీ.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎన్నో ఏళ్లుగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు …
కనీసం ఇప్పటికైనా పర్యాటక ప్రాంతంగా భువనగిరి కోటని ప్రభుత్వం నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తే.. త్వరలోనే ఎంతో గొప్పగా ప్రసిద్ధి చెందుతుందని స్థానికుల అభిప్రాయం…!!