ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆడపిల్లకు ఆస్తిలో సమాన హక్కు కలిగి ఉంటారని చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. సవరించిన హిందూ వారసత్వ హక్కు చట్టం 2005 ప్రకారం ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని అలాగే, తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆస్తిలో కూతుళ్లకు హక్కు ఉంటుందని ఈ తీర్పులో పొందుపరిచింది. 2004 డిసెంబర్ 20వ తేదీకి ముందు సదరు ఆస్తి పంపకం చేసినా,పరాధీనం చేసినా, విభజించిన, వీలునామా ప్రకారం పంపకాలు చేసినా,సరే హిందూ వారసత్వ చట్టం లోని సెక్షన్ 6(1) ప్రకారం కుమార్తె కూడా తన వాటా కోసం డిమాండ్ చేయవచ్చు అని జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పులో పేర్కొనడం జరిగింది.
వారసత్వ ఆస్తి లో మహిళలకు సమాన హక్కు కల్పిస్తూ 2005లో హిందూ వారసత్వ చట్టాన్ని సవరించారు.
అయితే సవరణ జరిగిన నాటికి తండ్రి కుమార్తె జీవించి ఉంటే ఈ చట్టం వర్తిస్తుంది లేక అంతకు ముందు నుంచి వర్తిస్తుందా అనే విషయంపై స్పష్టత కోసం పౌరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ విచారణపై ఏర్పాటైన ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.