Rangamarthanda Movie review : నటీనటులు: ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు
నిర్మాతలు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
దర్శకత్వం : కృష్ణవంశీ
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లి
విడుదల తేది: మార్చి 22, 2023
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ నుంచి సినిమా వచ్చి చాలాకాలం అయ్యింది. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘నక్షత్రం’(2017) బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ.. ఇప్పుడు ‘రంగమార్తాండ’తో వచ్చాడు. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. భారీ అంచనాల ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..
కథ :
రంగస్థలంపై ఎన్నో పాత్రలకి జీవం పోసి రక్తి కట్టించిన నటుడు రాఘవరావు (ప్రకాశ్ రాజ్). నాటకరంగమే ప్రపంచంగా బతికిన ఆయనకి రంగమార్తాండ అనే బిరుదుని ప్రదానం చేస్తారు. ఆయన స్నేహితుడు చక్రపాణి (బ్రహ్మానందం) కూడా రంగస్థల నటుడే. ఇద్దరూ కలిసి దేశ విదేశాల్లో ప్రదర్శనలతో ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నవారు. జీవితంలో ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకున్న వారు.
రంగమార్తాండ బిరుదుతో తనని సత్కరించిన వేదికపైనే నాటక రంగం నుంచి నిష్క్రమించి తను సంపాదించిందంతా వారసులకి కట్టబెడతాడు రాఘవరావు. అక్కడి నుంచి ఆయన జీవితంలో కొత్త అంకం మొదలవుతుంది. ఆ అంకంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? రంగస్థలంపై పోషించిన ప్రతిపాత్రనీ రక్తి కట్టించిన రాఘవరావుకి నిజ జీవితం ఎలాంటి పాత్రని ఇచ్చింది? మరి జీవిత నాటకంలో గెలిచాడా లేదా అంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ :
కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయత, అనురాగాల, భావోద్వేగాలు దట్టించిన చిత్రం రంగమార్తండ. దర్శకుడు కృష్ణవంశీ సన్నివేశాలను తెరపైన పేర్చిన తీరు.. పాత్రలను రాసుకొన్న తీరు.. స్క్రీన్ మీద సజీవంగా మార్చాయి. నాగరికత పేరుతో విచ్చిన్నమవుతున్న కుటుంబాలు,
స్వార్ధంతో బతుకుతున్న మనుషులకు రంగమార్తండ చెంపపెట్టులా ఉంటుంది. ఆనందం, బాధ, దు:ఖం, వినోదం అందిస్తూ.. ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. కుటంబంలో పిల్లలు ఎలా ఉండాలి? జీవిత చరమాంకంలో తల్లిదండ్రుల ధీనస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఫ్యామిలీ అంతా చూడాల్సిన చిత్రం రంగమార్తండ.
ప్లస్ పాయింట్స్ :
* నటీనటుల భావోద్వేగాలు,
* బ్రహ్మానందం పాత్ర
* మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
* తారాబలం లేకపోవడం
* ప్రేక్షకుడి అంచనాకి తగ్గట్టుగా సాగే కథ
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్ : అక్షరాన్ని పొడిగా పలకకు.. దాని వెనుక తడిని చూడు అని సినిమాలో ఓ డైలాగ్ ఉంది. నిజంగా ఈ సినిమాలోని తడిని ప్రేక్షకులు చూడాలి. రంగమార్తాండ.. హృదయాల్ని హత్తుకునే చిత్రం.