వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన ట్వీట్స్ వివాదానికి దారి తీశాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఆయన వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆంద్రప్రదేశ్ నాయకులకు తెలంగాణా లో పనేంటి అంటూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వారిద్దరూ హైదరాబాద్ జరుపుకోవడాన్ని ఎద్దేవా చేశారు. స్థానికంగా అందుబాటులో లేనివాళ్ళు నాయకులు గా చలామణి అవుతున్నారని నర్మగర్భంగా ఆయన చేసిన ట్వీట్ల సారాంశం.
దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు కౌంటర్లు ఇవ్వడంతో ట్విట్టర్ కాసేపు వేడెక్కింది. కరోనా వస్తే అన్ని సౌకర్యాలతో మెరుగైన వైద్య సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయని చెప్పిన మీరు, హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోవడం ఏంటని వారు ఎదురు ప్రశ్నించారు. మీకో న్యాయం ఇతరులకో న్యాయమా ? అంటూ అంబటిని నిలదీశారు.
కొందరైతే స్వాతంత్ర్య దినోత్సవం అనేది దేశం మొత్తానికి సంబంధించిన వేడుక అనీ.. హైదరాబాద్ లో జరుపుకోవడంలో తప్పేం ఉంది అనీ.. దీనిని కూడా రాజకీయం చేయడం తగదనీ అంబటికి హితవు పలికారు.