Nagababu : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎన్.ఆర్.ఐ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్ తరాలకు భద్రత కలుగుతుందనే పట్టుదలతో, పార్టీకి అండగా ఉంటూ పని చేస్తున్న గల్ఫ్ దేశాల ఎన్. ఆర్.ఐ కార్యకర్తల అంకితభావం చాలా విలువైనదని నాగబాబు స్పష్టం చేశారు.
ఆయన దుబాయ్ పర్యటనలో భాగంగా శుక్రవారం అజ్మన్ నగరంలోని మైత్రి ఫామ్ లో గల్ఫ్ దేశాల ఎన్నారై కార్యవర్గ సభ్యుల సమావేశాన్ని నిర్వహించి వారితో మాట్లాడారు. ఆ సమావేశాన్ని ఉద్దేశించి నాగబాబు మాట్లాడుతూ.. వృత్తి, వ్యాపారం పరంగా గల్ఫ్ దేశాల్లో స్థిరపడినప్పటికీ మాతృభూమిపై వీరికి ఉన్న మక్కువతో, అలాగే ప్రజా ప్రయోజనాల కోసం జనసేన పార్టీని
అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల ఎన్, ఆర్,ఐ కార్యకర్తలు అందిస్తున్న సహాయ సహకారాలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎన్.ఆర్.ఐ కార్యకర్తలకు పార్టీలో గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించాలి అని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఆయన సూచనల మేరకు గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ఎన్.ఆర్.ఐ జనసైనికులు, వీరమహిళ కోసం ప్రత్యేక కమిటీలు మేము ఏర్పాటు చేశామని వెల్లడించారు.
తదుపరి కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎన్నారై సమన్వయకర్త కొలికొండ శ్రీధర్ పార్టీ విధివిధానాల గురించి కార్యకర్తలకు వివరించారు. పిమ్మట దుబాయ్ యూఏఈ జనసేన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు చేతుల మీదగా ప్రారంభోత్సవం చేశారు. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యాలయంలో గల్ఫ్ జనసేన హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు.