గణేష్ ఉత్సవాల నిర్వహణకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వక కుట్రలు చేస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉత్సవాల నిర్వహణ పై స్పష్టత లేని యంత్రాంగం నిర్వాహకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఆంక్షల పేరిట అక్రమ కేసులు బనాయిస్తే దీటుగా బిజెపి జవాబు చెబుతుందన్నారు.
సామూహిక సమాజాన్ని ఏకీకృతం చేసే హిందూ ఉత్సవాలుగా గణేష్ నవరాత్రులు జరుగుతాయని ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉత్సవాలను నిర్వహించుకోవడం మన బాధ్యతని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధార్మిక సంస్థలు, గణేష్ ఉత్సవ సమితులు ఉత్సవాల నిర్వహణపై తమ నిర్ణయాన్ని ప్రకటించాయి.
ఆ నిర్ణయాలను పాటిస్తూ గణేష్ ఉత్సవాలను నిర్వహించడం మన విధి. ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి స్పష్టత లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు తమ ఇష్టానుసారంగా ఉత్సవాల నిర్వహణకు విరుద్ధంగా నిబంధనలు విధిస్తూ ఉత్సవ నిర్వాహకులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. స్పష్టత లేని రాష్ట్ర పాలకులు, అధికారులు హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. ఇది ఆక్షేపనీయం, గర్హనీయం. ఈ సమయంలో ధార్మిక సంస్థలు, హిందూ ఉత్సవ సమితులు నిర్దేశించిన విధంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని బిజెపి పిలుపునిస్తుంది. ఈ సమయంలో ఉత్సవ నిర్వాహకులకు బిజెపి నాయకత్వం అండగా ఉంటుందని, అధికారుల నుంచి, పోలీసుల నుంచి ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బందులు, బెదిరింపులు ఎదురైతే స్థానిక హిందూ ధార్మిక సంస్థలను, బిజెపిని సంప్రదించాలని కోరుతున్నానని తెలిపారు. సమాజాన్ని సంఘటితం చేసే గణేష్ ఉత్సవాలకు నాంది పలికిన బాల గంగాధర్ తిలక్ ఆదర్శాలు హిందూ సమాజం అనుసరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సిద్ధంగా ఉందని, హిందూ భక్తులను, ఉత్సవ నిర్వాహకులను ప్రభుత్వం అధికారులు ఎవ్వరూ భయబ్రాంతులకు గురిచేసినా దీటుగా ప్రతిఘటించేందుకు వివిధ మోర్చాల నాయకులు,పార్టీ నేతలు సిద్ధంగా ఉంటామని తెలియజేశారు.
కోవిడ్ నిబంధనల పేరిట అధికారులు,పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కోవిడ్ నిబంధనల సాకుతో టిఆర్ఎస్ పార్టీ నేతలు అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలు ప్రజలు గమనించాలని, ఉద్దేశ పూర్వకంగా గణేష్ ఉత్సవాల నిర్వహణను తప్పుదారి పట్టిస్తున్న ప్రభుత్వం ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకునేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వ చర్యలను బిజెపి దీటుగా ఎదుర్కొంటోందని అన్నారు.