Ap Politics : మన భవితని, రాబోయే తరాల భవిష్యత్ ని ప్రభావితం మాత్రమే కాదు శాసించే రాజకీయ వ్యవస్థ. ఈ ప్రజలకి మేము జవాబుదారీకాము, మమ్మల్ని ప్రశ్నించేస్థాయి, అర్హత ఎవరికీ లేదు అనే ఆలోచనా విధానంలోకి వెళ్ళిపోయారు నాయకులు. ప్రజల్ని బలహీనులుగా, అశక్తులుగా, నిసహాయులుగా చేసేందుకు వారి అధికారాన్ని వినియోగించుకుంటున్నారు. అయిదేళ్లకోసారి, ఓట్లు అడిగేందుకు మేమోస్తాం, చేతిలో చెప్పులు చూపిస్తాం అనే ధోరణిలో స్థిరపడిపోయారు నాయకులు. రాముడు కాలంలో పీఠమెక్కి రాజ్యం కూడా చేశాయి. రాముడి పాదుకలను తెచ్చి భరతుడు సింహాసనం మీద ఉంచి పద్నాలుగేళ్ళు పాలించాడు.
ఆది పురాణకాలం అలా చెప్పులు పాలించిన చరిత్ర పురాణాల్లో ఉంది. అప్పట్లో ప్రధాని పీవీ కడప సభ సందర్భంగా హాజరైన కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డిపై చెప్పులు వేయించారంటూ అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. వైశ్రాయ్ హోటల్‌లో స్వర్గీయ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబుపై ఆరోపణలు వచ్చాయి. అది గతం.. ఇప్పుడు మళ్ళీ ఏపీలో చెప్పుల రాజకీయం మోత మోగిస్తోంది. ఇప్పటికి కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆఫీసులో చెప్పు తీసి చూపించారు. అప్పట్లో అది సంచలనం అయింది.
చెప్పులు తీయడమేంటి అని పవన్ పాలిటిక్స్ మీద విమర్శలూ వచ్చాయి వైసీపీ. ఆ చెప్పుల కథను మరింతగా పెంచి ముందుకు తీసుకుని పోయింది. మీకేనా చెప్పులు ఉండేవి మాకూ ఉన్నాయని వైసీపీ మంత్రులు నాడూ గర్జించారు. అలా ఆ చెప్పులో ఎపిసోడ్ లో దొందు దొందే అన్నట్లుగా వారూ వీరూ చేసుకున్న విమర్శలతో రాజకీయాలే ఇంత అనుకుంటున్నారు జనాలు. అయితే వారాహి రధమెక్కిన తరువాత మరోమారు వైసీపీ నేతల చేతుల్లో చెప్పులు కనిపించాయి. మీడియా మీటింగులో ఏకంగా రెండు చెప్పులు చూపించారు. ఇలా చెప్పుల రాజకీయం ఏపీలో వెగటుగా జుగుప్సాకరంగా సాగుతోంది.
చెప్పు తీయడమేంటి అంటూ సుద్దులు చెబుతూనే నీవు ఒక చెప్పు చూపిస్తే మేము రెండు చెప్పులు చూపిస్తాం.. నీవు రెండు చెప్పులు చూపిస్తే మేము నాలుగు చూపిస్తామని లెక్క కట్టి మరీ అనడం ఏపీ రాజకీయాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్ధం కానీ పరిస్థితి. పవన్ కళ్యాణ్ అయితే రాజకీయ అనుభవం తక్కువ ఉన్న వారు అని వైసీపీ నేతలు అంటారు. మరి దశాబ్దాల అనుభవం ఉన్న వైసీపీ నేతలు కూడా చెప్పులు చూపిస్తూ మాట్లాడడమేంటి.. అసలు ఎటుపోతోంది ఈ రాజకీయం అనిపించకమానదు. చెప్పులను చూపిస్తూ చీప్ పాలిటిక్స్ చేద్దామనుకున్నా చెప్పులకు ఏమీ కావు. అవి ఎప్పుడూ పాదరక్షలే వాటిని మధ్యలోకి తీసుకొచ్చిన నేతలే ఏ రాజకీయ రక్షణా లేకుండా భవిష్యత్తులో ఇబ్బంది పడతారేమో జర జాగ్రత్త.