పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటుందట. అలాగే కొన్ని పత్రికలు, చానల్స్ ప్రజలు ఇంకా తమని గమనించలేదు అనుకుంటాయేమో? మీడియా ని చేతిలో పెట్టుకుని ఎన్నో నీతి కబుర్లు చెప్పేస్తూ ఉంటాయి. నచ్చని వ్యక్తుల మీద బురద జల్లుతూ ఉంటాయి. ఒక పార్టీకి కొమ్ము కాస్తు ఇతర పార్టీలకు ఓ శ్రేయోభిలాషి లా ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటాయి. నిజానికి ఇక్కడ వీరిచ్చే సలహాలను ఆ పార్టీలు తీసుకుంటాయని కాదు. ఆ పేరుతో చాలా తెలివిగా రూమర్స్ క్రియేట్ చేయడం, ప్రజల్ని లేనిపోని కన్ఫ్యూజ్ కి గురిచేయడం, ప్రజల్లో అపోహల్ని సృష్టించడం, అనుమాన బీజాలు నాటడం వీటి ముఖ్య ఉద్దేశం. తాజాగా ఏబీఎన్ రాధాకృష్ణ కూడా తన లేటెస్ట్ ఎడిటోరియల్ లో ‘హలో వింటున్నారు’ అంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై అంతా తన కళ్ళ ముందే జరిగినట్టు, జరుగుతున్నట్టు, జరగబోతున్నట్టు ఏవేవో రాసేశారు.. పనిలో పనిగా మీ జీవీఎల్ మీ ఇష్టం అంటూ జీవీఎల్ వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ వ్యవహరించాల్సిది ఇలా కాదనీ.. అధికారంలోకి రావాలనుకుంటే జీవీఎల్ ని అదుపులో పెట్టుకోవాలని బిజెపి పెద్దలకు ఓ సలహా పడేశారు.
దీనికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఏబీఎన్ రాధాకృష్ణ కు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు అన్యధా భావించకండి అంటూనే సుతిమెత్తగా ఏకిపారేశారు.. ఆయన రాసిన లేఖలో.. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మీ సంపాదకీయం లో మా ఎంపీ జి వి ఎల్ ని టార్గెట్ చేసి మీరు రాసిన మీ జివిఎల్.. మీ ఇష్టం.. అనే విశ్లేషణ చదివాను. మా జివీఎల్ గారు చంద్రబాబు ని విమర్శించడం మాకే మంచిది కాదని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు. బిజెపి ఆంధ్రప్రదేశ్లో బలపడాలంటే జివిఎల్ లాంటివారిని మా నాయకత్వమే కట్టడి చేయాలని సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోడీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీ ని విమర్శించిన మీకు సడన్ గా బిజెపి పై ప్రేమ పుట్టుకొచ్చి మేము ఆంధ్రప్రదేశ్ లో ఎదగటం లేదని మీరు ఫీలవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. ఇది మీకు కొత్తగా బీజేపీపై పుట్టుకొచ్చిన ప్రేమ కాదని పతనం అంచున ఉన్న టీడీపీ ని కాపాడే ప్రయత్నం అని చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. మీరు టిడిపి సలహాదారులుగా అనుకూలంగా వ్యవహరిస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్ గా, నిర్లజ్జగా మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని, మీ రాజకీయ సలహాలు చంద్రబాబుకు మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీ లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పరిమితం కావడం లో మీ పాత్ర కూడా ప్రధాన మైనది. టీడీపీ మీ సలహాలను కొనసాగితే వచ్చే ఎన్నికల్లో రెండు లేదా మూడు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని అన్నారు. మా జాతీయ నాయకత్వానికి మా పార్టీని ఎలా కాపాడుకోవాలో తమరు సలహా ఇచ్చారు. మీ విశ్లేషణ లోని అసలు మతలబు ఏమిటో మీ తాపత్రయం ఏంటో మా జాతీయ నాయకత్వానికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడకండి అంటూ విరుచుకు పడ్డారు. మీరు బహిరంగ విశ్లేషణ చేసారు గనుక మీకు బహిరంగ లేఖ రాస్తున్నానని అన్యధా భావించవద్దని సోము లేఖలో పేర్కొన్నారు.
“బిజేపి అంటే చంద్రబాబు కంటే మీకే ఎక్కువగా భయం పట్టుకున్నట్టు ఉంది” అంటూ మొదలెట్టిన సోము ఎక్కడా తగ్గకుండా డైలాగ్ ల మీద డైలాగ్ లతో వేమురి రాధాకృష్ణ ని టిడిపి ని కలపి ఉతికి ఆరేసినంత పనిచేసారు.
ఏది ఏమైనా ఈ విషయంలో సోము వ్యవహరించిన తీరు కచ్చితంగా అభినందించాల్సిందే. చేతిలో పత్రికలను పెట్టుకొని పొలిటికల్ పార్టీలు వ్రాయించే విషపు వ్రాత లపై తక్షణం స్పందిస్తే ప్రజలు లేనిపోని కన్ఫ్యూజన్ కు గురికాకుండా ఒక క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది.
