భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కాపులు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. ప్రస్తుతానికి కాపు ఓటు బ్యాంకు అన్ని పార్టీలు కొంతమేర సొంతం చేసుకోగా ఇప్పుడు బిజెపి ఆ వర్గం ఓటు బ్యాంకుపై కన్నేసినట్లు కమలనాథుల రాజకీయ వ్యూహం గమనిస్తే అర్ధమవుతుంది. కాపులు ప్రస్తుతం కొంత అసంతృప్తిలో వున్నట్టు గుర్తించిన బీజేపీ వారిని నెమ్మదిగా తమవైపు లాక్కునే మార్గాల కోసం అన్వేషిస్తుంది. సోము వీర్రాజు అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ఇప్పుడా కార్యక్రమంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభం, మెగాస్టార్ చిరంజీవి లాంటి నాయకులకి బిజెపి వల వేసినట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే వారితో కొంత మేరకు చర్చలు కూడా జరిపినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే వైసిపి, టిడిపి లో ఉన్న అసంతృప్తి నాయకులను సైతం తమ వైపు లాక్కుని మరింత బలపడే ప్రయత్నాలను బిజెపి ప్రారంభించింది. జనసేన పార్టీలో చేరడానికి ఇష్టంలేని కొంతమంది సీనియర్ నాయకులు కమలం వైపు చూస్తున్నట్టు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పునరేకీకరణ చర్యల్లో భాగంగా బిజెపి తనకు తానుగా బలపడే అన్ని ప్రయత్నాలు తప్పక చేస్తుందని సోము వీర్రాజు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే.. ఆ పార్టీ చాలామంది నాయకులను కలుపుకుని వెళ్ళకపోవడం వల్ల చాలామంది గత ఎన్నికల్లో మౌనం వహించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉండడం వల్ల కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు జనసేనలో చేరడం కంటే బీజేపీలో చేరడం పైనే ఆసక్తి చూపిస్తున్నారు. జాతీయ పార్టీలో చేరడం వల్ల తమ రాజకీయ భవిష్యత్తు ఆటంకాలు ఉండవనీ.. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడటం భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో మరింత బలపడే అవకాశం ఉంటుందని తద్వారా ఆంధ్రప్రదేశ్లో తాము కోరుకున్న స్థానం నుంచి, సొంత నియోజకవర్గం నుండి పోటీ చేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్న మెజారిటీ నాయకులు కమలం వైపు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే ఆయా స్థానాలలో వైసీపీ టీడీపీ అభ్యర్ధులు ఉండడంతో తమకు బీజేపీ రూపంలో ప్రత్యామ్నాయ అవకాశం దొరుకుతుందని వారు అభిప్రాయ పడుతున్నారు. ఇదే జరిగితే కొంతలో కొంత జనసేన కూడా బలహీనపడి బిజెపి పూర్తిస్థాయిలో పోటీలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.