Nadendla Manoher – Navarathnalu : గుంటూరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కనిపించిన వారందరికీ ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరి రకరకాల మాయ మాటలతో మోసం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ఈసారి హెలికాప్టర్ లో వస్తున్నాడు. మాయ మాటలతో మభ్యపెట్టడానికి చూస్తాడు అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల లో మనోహర్ గారు చెప్పారు.
ఒక్క అవకాశం ఇచ్చి నిండా మునిగిన ఏపీ ప్రజలు, మళ్లీ అదే తప్పు చేయకుండా ఈసారి బడుగు బలహీన వర్గాలకు దళిత, మైనారిటీలకు అండగా నిలబడే జనసేన పార్టీకి అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. గుంటూరు నగరంలో సోమవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది.
సమావేశం ప్రారంభానికి ముందు దివంగతులైన ప్రజా గాయకుడు గద్దర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వివిధ వర్గాల నాయకులు వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడారు. ఎన్ని పథకాలు తెచ్చినా పాలించేవాడు సరైనోడు కాకపోతే మొత్తం వ్యవస్థకే చేటు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. నవరత్నాల పేరుతో పథకాలను ప్రజలకు అందజేస్తున్నామని చెబుతున్న వైసీపీ, వివిధ వర్గాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల నిధులను బలవంతంగా దారి మళ్ళించి నవరత్నాలు అమలు చేస్తోంది.
అన్ని వర్గాలకు మేలు చేస్తామని చెప్పడం వేరు.. ఆచరించడం వేరు. జనసేన పార్టీ సంస్థాగత పదవుల్లో అన్ని వర్గాలకు తగు ప్రాధాన్యం కల్పించింది. అందరికీ సమాన అధికారాలను ఇచ్చింది. ఏ వర్గాన్ని పూర్తిస్థాయిలో ఆదుకోని పరిపాలన లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిత్యం యాతన పడుతున్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క కుటుంబాన్ని అయినా పేదరికం నుంచి ధనికులుగా మార్చామని చెప్పే ధైర్యం ఉందా..? ఏ కుటుంబ జీవన శైలిని అయిన మార్చాము అని ఘనంగా చెప్పుకోవడానికి ఉదాహరణ ఉందా..? చెప్పండి నాదెండ్ల వెల్లడించారు.