Pawan Kalyan – Jagan : ఎన్నికల ముందు అధికారం కోసం నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చిన పెద్ద మనిషి తర్వాత అవన్నీ గాలిలో కలిపేశాడు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన జగన్ తర్వాత అన్నీ రంగాలను ప్రైవేటు వారికి కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగ భద్రత వస్తుందని, అన్నీ రంగాల వారు ఆశగా ఎదురు చూశారు. ఈ-సేవ కేంద్రాల సిబ్బందికి సైతం మేలు చేస్తానని చెప్పి, సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇప్పటికైనా అన్నీ వర్గాలు ఆలోచించాలి. రకరకాల మోసాల మాటలు చెప్పిన వ్యక్తికి ప్రజలు బలంగా బుద్ధి చెప్పాలి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు జనసేన ప్రభుత్వంలో బలమైన ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రా యూనివర్సిటీ ఏమైనా వైసీపీ విశ్వవిద్యాలయమా? ఆంధ్రా యూనివర్సిటీ ఉత్తరాంధ్రకు చదువుల పట్టుగొమ్మ. ఈ విశ్వవిద్యాలయాన్ని వైసీపీ విశ్వవిద్యాలయంగా మార్చేస్తే చూస్తూ. సహించేది లేదు. వీసీ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి.
ఎంతో చరిత్ర కలిగిన యూనివర్శిటీలో నియామకాలు దగ్గర నుంచి నిధుల వినియోగం, ఫీజుల పెంపుదల వరకు లెక్కలేనన్ని ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై కేంద్ర మానవ వనరుల శాఖకు ఫిర్యాదు చేస్తాం. వీసీ చేస్తున్న అన్ని పనుల మీద పక్కా ఆధారాలను విద్యార్థులు తీసుకొస్తున్నారు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్ధి లోకానికి దశదిశా చూపించాల్సిన ఆంధ్రా యూనివర్సిటీ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. యూనివర్సిటీల పాలన మీద జనసేన ప్రభుత్వంలో పారదర్శక నిర్ణయాలు తీసుకుంటాం.
భావి భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాలు ఉంటాయి. ఇటీవల కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో రెండో పేపర్ లో కొన్ని తప్పులు వచ్చాయి. దీంతో సుమారు 50 వేల మందికి మార్కులు తగ్గి పోస్టులకు అనర్హులు అయ్యారు. ప్రభుత్వం పేపర్ లో చేసిన తప్పులకు యువత బలికావడం దారుణం, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. యువత కోర్టులో కేసులు వేశారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం చేసిన తప్పులకు బలైపోయిన యువతకు న్యాయం చేయాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.